గోదావరిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

17 Apr, 2018 12:02 IST|Sakshi
రాంబాయి (ఫైల్‌), పారిజాతం (ఫైల్‌)

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణం

నంబాలలో విషాదఛాయలు

దండేపల్లి(మంచిర్యాల)/ధర్మపురి: కుటుంబ కలహాలు.. ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి తన కూతురుతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద సోమవారం వెలుగుచూసింది. మృతులది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామం. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నంబాల గ్రామానికి చెందిన గోపతి సత్తయ్య, రాంబాయి దంపతులకు పంచకూల, పారిజాతం కూతుళ్లు. 2004 నుంచి సత్తయ్య సింగాపూర్‌ వెళ్లివస్తున్నాడు. అయినప్పటికీ నయాపైసా సంపాదించలేదు. ఏడేళ్ల క్రితం వారికున్న నాలుగెకరాల్లో రెండెకరాలు అమ్మి.. పెద్ద కూతురు పంచకూల వివాహం చేశారు. ప్రస్తుతం చిన్న కూతురు పెళ్లీడుకొచ్చింది. సింగాపూర్‌లో ఉన్నా.. ఇక్కడున్నా.. సత్తయ్య కుటుంబాన్ని ఏనాడూ పట్టించుకునేవాడుకాదు.

ఇటీవలే సింగాపూర్‌ నుంచి వచ్చిన సత్తయ్యతో కూతురుకు పెళ్లి చేయాలనే విషయాన్ని రాంబాయి వివరించింది. దీనికి సమాధానం చెప్పకపోవడంతో ఉన్న రెండెకరాలు విక్రయించేందుకు రాంబాయి సిద్ధపడింది. దీనికి సత్తయ్య అడ్డుపడ్డాడు. 15రోజులుగా ఇంట్లో కలహాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో విరక్తి చెందిన రాంబాయి జాతకం చూపిద్దామని ఆదివారం ఉదయం కూతురు పారిజాతంతో కలిసి ధర్మపురికి బయల్దేరింది. రాత్రివరకూ ఇంటికి రాకపోవడంతో సత్తయ్య, కుటుంబసభ్యులు గాలించారు. సోమవారం రాయపట్నం వద్ద గోదావరిలో రెండు మృతదేహాలు కనిపించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. బంధువులు చేరుకుని రాంబాయి(41), పారిజాతం(23)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి సీఐ లక్ష్మీబాబు, ఎస్సై లక్ష్మీనారాయణ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి సోదరుడు వెంకటస్వామి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

నంబాలలో విషాదఛాయలు
రాయపట్నం వద్ద మృతదేహాలను చూసిన అనంతరం కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తల్లీ, కూతుళ్లు జంటగా ఆత్మహత్య చేసుకోవడంతో నంబాల గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు