అవమానంతో తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

28 Jan, 2019 12:36 IST|Sakshi
మృతిచెందిన మతిస్థిమితంలేని జయమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణమ్మ

కూతురు మృతి.. తల్లి పరిస్థితి విషమం

రైల్వే పోలీసుల బెదిరింపులే కారణం

అనంతపురం, బత్తలపల్లి: విచారణ పేరిట రైల్వే పోలీసులు బెదిరింపులకు దిగడంతో అవమాన భారం భరించలేక తల్లీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళ్తే... పోట్లమర్రి గ్రామానికి చెందిన శ్రీరాములు, కృష్ణమ్మ దంపతులకు మతిస్థిమితంలేని కూతురు జయమ్మ, కుమారుడు మారుతి ఉన్నారు. కుమారుడు మారుతి గతంలో రైల్వేస్టేషన్‌లో ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బును విత్‌డ్రా చేశాడనే కారణంతో ఏడాది క్రితం తన ఇంటికి వచ్చిన రైల్వే పోలీసులు తమ ఇంటిలోని రూ.65 వేల నగదుతోపాటు ఆరు తులాల బంగారు నగలు తీసుకెళ్లారని శ్రీరాములు తెలిపాడు.

అందులో బంగారు మాత్రం వెనక్కి ఇచ్చారన్నారు. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి వేళ రైల్వే పోలీసులు మరోసారి ఇంటికి వచ్చి తన కుమారుడిని అప్పగించాలని కోరారన్నారు. పోలీసులు కొడతారన్న భయంతో కుమారుడు ఇంటి నుంచి పారిపోయాడని తెలిపారు. పోలీసుల బెదిరింపులు.. అవమాన భారం భరించలేక తన భార్య కృష్ణమ్మ, బుద్ధిమాంద్యం గల కుమార్తె జయమ్మలు ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో విషపుగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. వెంటనే ఇద్దరినీ బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కుమార్తె జయమ్మ మృతిచెందింది. కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తన కుమార్తె మృతికి, తన భార్య చావుబతుకుల్లో ఉండటానికి కారణం రైల్వే పోలీసులేనని బాధితుడు శ్రీరాములు బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు