ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

12 Jan, 2018 12:27 IST|Sakshi
లారీని కారు ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందిన తల్లీకూతుళ్లు

తల్లీకూతుళ్ల దుర్మరణం  

జన్మదిన వేడుక పిలుపులకు వెళ్తూ విషాదం

నాయుడుపేటటౌన్‌: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నాయుడుపేటకు సమీపంలో స్వర్ణముఖీ కాజ్‌వేపై గురువారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. డక్కిలి మండలం కమ్మపల్లికి చెందిన వళ్లూరు నాగార్జున కుటుంబం నెల్లూరులోని వేదాయపాళెంలో నివాసముంటుంది. నాగార్జున దుబాయిలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమారుడు జన్మదిన వేడుకలతోపాటు సంక్రాంతి పండగ కోసం ఇటీవలే నెల్లూరుకు వచ్చాడు. రెండు రోజుల్లో జరిగే అతని కుమారుడు మొదటి జన్మదిన వేడుకలకు బంధువులను పిలిచేందుకు నాగార్జున కుమారుడితోపాటు భార్య వళ్లూరు నిరంజని (31),  అతని అత్త ఈతమొక్కల సుబ్బమ్మ(60), అన్న కుమార్తె  స్రవంతితో కలిసి కారులో సత్యవేడు, వరదాయపాళెం తదితర ప్రాంతాల్లో ఉన్న బంధువులను పిలిచి, తిరిగి వెంకటగిరికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. వీరు శ్రీకాళహస్తి నుంచి ఏర్పేడు మీదుగా వెంకటగిరి వెళ్లాల్సి ఉండటంతో దారి మరచి నాయుడుపేటకు చేరుకున్నారు.

నాయుడుపేట మీదుగా వెంకటగిరికి ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో నాయుడుపేట సమీపంలో స్వర్ణముఖి కాజ్‌వే వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీకొంది. అక్కడ ఏటి పండగలో ఎగ్జిబిషన్‌ నిర్వహించేందుకు వివిధ వస్తువులను దించేందుకు లారీని కాజ్‌వేపై నిలిపి ఉంది. లారీలో అల్యూమినియం చానెళ్లు ఒక్కసారిగా కారులో ఒక పక్కన కూర్చొని ఉన్న నాగార్జున భార్య నిరంజని, అత్త సుబ్బమ్మకు తగలడంతో అక్కడికక్కడే రోడ్డు మీదపడి దుర్మరణం చెందారు. కారు నడుపుతున్న నాగార్జున,  అతని కుమారుడు, స్రవంతి త్రుటిలో ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నా రు. సమాచారం అందుకున్న ఎస్సై రవినాయక్‌ ఘటనా స్థలా న్ని పరిశీలించారు. స్వర్ణముఖినది కాజ్‌వేపై రెండు వైపులా స్తంభిం చిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీని రోడ్డు పై నిర్లక్ష్యంగా నిలిపి ఉండటంతో వారిపై కేసు నమోదు చేశారు. 

మిన్నంటిన రోదనలు
అప్పటి వరకు ఎంతో సంతోషంగా వచ్చి క్షణంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన భార్య, అత్త మృతదేహాలను చూసి నాగార్జునతోపాటు అతని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఏడాది బాలుడు తల్లి మృతి చెందిన విషయం తెలియకపోయిన రోదిస్తుండటం  స్థానికులు సైతం కలత చెందారు. సమాచారం తెలుసుకున్న నాగార్జున కుటుంబ సభ్యులు నాయుడుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోవడంతో అక్కడ రోదనలు మిన్నంటాయి.

మరిన్ని వార్తలు