కుమార్తెతో సహా మహిళ అదృశ్యం

24 May, 2019 08:16 IST|Sakshi
ప్రియాంక, స్వరూప(ఫైల్‌)

పక్కింటి యువకుడిపై కుటుంబసభ్యుల ఫిర్యాదు

ఆత్మహత్యాయత్నం పేరుతో నిందితుడి నాటకం

లంగర్‌హౌస్‌: కుమార్తెతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గురువారం లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు రప్పించగా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నటించాడు.పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా, పారుమంచాల గ్రామానికి చెందిన ప్రసాద్, ప్రియాంక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. బతుకుదెరువు నిమిత్తం ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చిన వీరు లంగర్‌హౌస్, ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్నారు. ప్రసాద్‌ సెక్యూరిటీగార్డుగా పని చేసేవాడు. ఈ నెల 21న ప్రసాద్‌ డ్యూటీకి వెళ్లిపోగా ప్రియాంక, తన చిన్న కుమార్తె స్వరూప(4)ను తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు పరిసరాల్లో గాలించినా ప్రయోజనం లేక పోవడంతో ప్రసాద్‌ లంగర్‌హౌస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియాంక పక్కింట్లో ఉంటున్న ఆదిత్యతో చనువుగా ఉండేదని ఈ విషయమై తమ మధ్య గతంలో గొడవలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదిత్యతో పాటు అతని అక్క దీప కలిసి తన భార్యా పిల్లలను కిడ్నాప్‌ చేసి ఉంటారన్నాడు.

చికిత్స పొందుతున్న నిందితుడు ఆదిత్య
ఆత్మహత్యాయత్నం నాటకం..
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదిత్య, అతని సోదరి దీపికను అదుపులోకి తీసుకుని విచారించారు. తన తమ్ముడు, ప్రియాంక చనువుగా ఉన్న మాట వాస్తవమేనని, దీంతో తమ సోదరుడిని కట్టడి చేసినట్లు దీపిక పోలీసులకు తెలిపింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లిన ఆదిత్య బ్లేడుతో చేతిపై గాటు పెట్టుకుని పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు. పోలీసుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పినా లంగర్‌హౌస్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించకుండానే అతడికి చికిత్స అందించారు. దీంతో సదరు ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోన్నట్లు పోలీసులు తెలిపారు.  తల్లికూతుళ్ల ఆచూకీ తెలిసిన వారు 9490616567 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు