తల్లి, కుమార్తె ఆత్మహత్య

4 Mar, 2019 12:21 IST|Sakshi
మంచంపై మృతదేహాలు, ఘటనా స్థలంలో విచారిస్తున్న ఇన్‌స్పెక్టర్‌

 కుటుంబ కలహాలే కారణం

 అనుమానాస్పద  మృతి కింద కేసు నమోదు

 మృతదేహాలు మార్చురీకి తరలింపు

 శోకసంద్రంలో బాధిత కుటుంబ సభ్యులు 

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి, కుమార్తెలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని ఏసీనగర్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి నగరానికి చెందిన కన్నప్ప, రాజేశ్వరమ్మ దంపతులు. వీరికి శారద (35) కుమార్తె ఉంది. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి కొంతకాలం తర్వాత మృతి చెందాడు. తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో అప్పటి నుంచి బంధువుల ఇంట్లో ఉండేది. 2004లో శారద అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి నీలిమ (13), గణేష్‌ ఇద్దరు పిల్లలు ఉనానరు. కొంతకాలం సజావుగా సాగిన వారి కాపురంలో కలతలు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలో 2010లో ఇద్దరు విడిపోయారు. శారద తన ఇద్దరి పిల్లలను పెట్టుకుని ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ తిరుపతి కిరణ్‌ అలియాస్‌ చందుతో ఆమెకు పరిచయం అయింది. ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. తొమ్మిదేళ్ల కిందట వారు ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. తొలి రోజుల్లో అపోలో హాస్పిటల్‌ సమీపంలో, ఆ తర్వాత బాలాజీనగర్‌ సీపీఎం కార్యాలయం సమీపంలో నివాసం ఉండేవారు. రెండేళ్ల కిందట ఏసీనగర్‌ çశానిటరీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో చేరారు. నీలిమ, గణేష్‌లను మల్లెల సంజీవయ్య స్కూల్‌లో 8, 6వ తరగతుల్లో చేర్పించారు. ఆటో, ఇతర పనులు చేసి వచ్చిన సంపాదనతో పిల్లలను చదివించుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. తరచూ శారద బంధువులు ఇంటికి వచ్చి ఆమె యోగక్షేమాలను తెలుసుకుని వెళ్లేవారు. 
అప్పుల బాధలు పెరగడంతో..

కిరణ్‌కుమార్‌ (ఫైల్‌) 
కిరణ్‌ కొంతకాలం కిందట తెలిసిన వారి వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. అవి తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ విషయమై కిరణ్, శారద మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి సమయంలో శారదకు చెప్పకుండా కిరణ్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. శారద అతని కోసం గాలించింది. కిరణ్‌ తిరుపతిలోని అతని తల్లిదండ్రుల వద్ద ఉన్నాడని తెలుసుకుని అక్కడి వెళ్లి తిరిగి రావాలని ప్రాధేయపడింది. అతను నిరాకరించాడు. ఇటీవల అతను అక్కడ నుంచి కూడా కనిపించకుండా వెళ్లిపోయాడు. అప్పులిచ్చిన వారు శారదపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శారద పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కిరణ్‌ కనిపించకపోవడంతో అతని తండ్రిని పిలిచి విచారించారు. అతను అప్పులన్నింటిని తానే కడుతానని అంగీకరించడంతో సమస్య సర్దుమణిగింది. 
తిరుపతికి వెళ్లదామని చెప్పి.. 
శారద శనివారం రాత్రి తిరుపతికి వెళ్లదామని స్కూల్‌ నుంచి వచ్చిన కుమార్తె, కుమారుడికి తెలియజేసింది. అనంతరం ముగ్గురూ కలిసి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. గణేష్‌ మూత్ర విసర్జన చేయాలని తల్లికి చెప్పడంతో పక్కనే ఉన్న బాత్‌రూమ్‌కు వెళ్లమని చెప్పింది. గణేష్‌ అటు వెళ్లిన వెంటనే శారద కుమార్తె నీలిమను తీసుకుని ఇంటికి వచ్చేసింది. బాత్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చిన గణేష్‌ తల్లి, అక్క కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. అప్పుడే రైలు వెళ్లడంతో తనను వదిలి తిరుపతికి వెళ్లిపోయి ఉంటారని ఏడుస్తూ ప్లాట్‌ఫాంపై తిరుగుతున్నాడు. గుర్తించిన రైల్వే పోలీసులు అతన్ని తమ వెంట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారించగా జరిగిన విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం వరకు పోలీసులు అతన్ని తమ వద్దనే ఉంచుకుని స్కూల్‌ ప్రాధానోపాధ్యాయురాలు హైమావతికి సమాచారం అందించారు.

ఆమె రైల్వేస్టేషన్‌కు చేరుకుని గణేష్‌ను తీసుకుని అతని ఇంటి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఉన్నారేమో చూడమని గణేష్‌ను లోపలికి పంపగా తలుపు నెట్టడంతో తెరుచుకున్నాయి. పడక గదిలో తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని వేళాడుతూ, అక్క మంచంపై మృతి చెంది ఉన్నారు. ఈ విషయమై స్థానికులు బాలాజీనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మరో కేసు విచారణలో ఉండటంతో సంతపేట ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కోటేశ్వరరావు, బాలాజీనగర్‌ ఎస్సై ఏడుకొండలులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శారద మృతదేహాన్ని కిందకు దించారు. ఘటన జరిగిన తీరును బట్టి చూస్తే శారద తొలుత తన కుమార్తెకు విషం ఇచ్చి ఆపై ఉరేసి, మృతి చెందిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

మృతురాలి బంధువుల వివరాలను సేకరించి వారికి సమాచారం అందించారు. మృతురాలి పెద్దమ్మ కుమారుడు షణ్ముగణం, బంధువులు హుటావుటిన నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటన జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందన్న షణ్ముగం ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతురాలి సెల్‌ఫోను, కిరణ్‌ సెల్‌ఫోన్‌ కాల్‌ డీటైల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. డాగ్‌స్వాడ్‌ ఘటనా జరిగిన ప్రాంతంలో కలియ తిరిగింది. మృతదేహాన్ని పోలీసులు జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు