తల్లి, ఆమె ప్రియుడికి ఏడాది జైలు

13 Dec, 2018 13:15 IST|Sakshi

చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో తీర్పు  

నెల్లూరు, గూడూరు: ప్రియుడి మోజులో పడిన ఓ తల్లి కన్న కొడుకు  అడ్డుగా ఉన్నాడని అడ్డు తొలగించుకునేందుకు చిత్రహింసలకు గురిచేసిన ఘటన కేసులో ఆమెకు, ఆమెకు సహకరించిన ప్రియుడికి ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ బుధవారం గూడూరు ప్రిన్సిపల్‌ జుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కె జయలక్ష్మి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం పొదలకూరుకు చెందిన వరలక్ష్మి మూడు వివాహాలు చేసుకుని అందరితో తెగతెంపులు చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు మగబిడ్డ కలిగాడు.

ఒంటరిగి ఉంటున్న ఆమెకు 2017లో అదే ప్రాంతానికి చెందిన వేలు మురుగన్‌తో స్నేహం ఏర్పడి, అతనితో సహజీవనం చేస్తోంది. అయితే అతను ఇంటికి వచ్చి పోయే సమయంలో తన ఆరేళ్ల కొడుకు అడ్డుగా ఉండడంతో  వరలక్ష్మి, వేలుమురుగన్‌ ఆ బాలుడ్ని చిత్రహింసలకు గురిచేయడం మొదలు పెట్టారు. ఈ బాధలు భరించలేక బాలుడు కేకలు వేస్తుండడాన్ని గుర్తించిన  అమ్మమ్మ కల్లూరు రమణమ్మ, తన కుమార్తె వరలక్ష్మి, వేలుమురుగన్‌పై పొదలకూరు పోలీస్‌స్టేషన్లో పిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్‌ను గూడూరు కోర్టులో దాఖాలు చేశారు. కేసు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు పైమేరకు శిక్ష, జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ సుకుమార్‌ వాదించారు.

మరిన్ని వార్తలు