వైద్యుల నిర్వాకానికి బలైన నిండు ప్రాణాలు..

23 Nov, 2019 10:19 IST|Sakshi
ఆస్పత్రి వద్ద రోదిస్తున్న భర్త, బంధువులు

సాక్షి, మహబూబ్‌నగర్‌ : వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలో కొందరు ప్రైవేట్‌ వైద్యుల నిర్వాకంతో బాలింతతో పాటు నవజాత శిశువు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని గొల్లబండతండాకు చెందిన రాజేశ్వరి ప్రసవం కోసం గురువారం పట్టణంలోని వన్‌టౌన్‌ సమీపంలోని శ్రీలతరెడ్డి ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో పని చేసే వైద్యులు రాజేశ్వరికి ఆపరేషన్‌ చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అధిక రక్తస్రావం, ఇతర కారణాల వల్ల మొదట బాలింత మృతి చెందగా.. కొద్ది నిమిషాల్లోనే నవజాత శిశువు కూడా మృతి చెందింది.

                                           బాలింత రాజేశ్వరి మృతదేహం

ఆస్పత్రి అద్దాలు ధ్వంసం
బాలింత రాజేశ్వరి, శిశువు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ధర్నా చేశారు. ఆస్పత్రికి సంబంధించిన కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి వన్‌టౌన్‌ పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయంపై సంబంధిత వైద్యురాలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అందరూ అర్హత కల్గిన వైద్యులే పని చేస్తున్నారని, అధిక రక్తస్రావం వల్లే బాలింత మృతి చెందిందని, దీంట్లో వైద్యుల తప్పులేదని చెప్పారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులతో సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు భేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు