రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకుల దుర్మరణం

22 Oct, 2019 12:08 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో ముగురి దుర్మరణం

మృతుల్లో తల్లి.. కుమారుడు..డ్రైవర్‌

డ్రైవర్‌ కునుకు తీయడంతోనే∙దుర్ఘటన 

సాక్షి, ఓబులవారిపల్లె(కడప) : విదేశం నుంచి బయలుదేరిన ఓ మహిళ ఇంటికి చేరే తరుణాన కొడుకుతో సహా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. వాహన చోదకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. వివరాలిలా.. నందలూరు మండలం నీలిపల్లి గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు, అతని భార్య మణెమ్మ జీవనోపాధి నిమిత్తం పాతికేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. కాస్తో కూస్తో సంపాదించుకుని అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి పోయేవారు. వారికి నలుగురు  కుమార్తెలున్నారు. సాయికిరణ్, సాయిచరణ్‌ అనే కవలలున్నారు. నలుగురు కూమార్తెలకు వివాహాలు అయ్యాయి. కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. ఈనేపథ్యంలో మణెమ్మ తన కుమారుడు సాయికిరణ్‌ను కూడా కువైట్‌ తీసుకువెళ్లాలని భావించింది. ఆదివారం రాత్రి ఇండియాకు బయలుదేరింది.

అర్ధరాత్రి దాటాక చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తల్లిని ఇంటికి తీసుకురావడానికి సాయికిరణ్‌ సొంత వాహనం ఉన్నా డ్రైవర్‌ లేకపోవడంలో మరో వాహనాన్ని బాడుగకు తీసుకున్నాడు. పాటూరుకు చెందిన పవన్‌కల్యాణ్‌(24) అనే యువకుడు ఈ కారుకు చోదకుడు. ఈ కారులో సాయికిరణ్‌ ఆదివారం రాత్రి  చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. తల్లి మణెమ్మ తీసుకొని తెల్లవారుజామున ఇంటికి బయలు దేరారు. మండంలోని రెడ్డిపల్లె చెరువు చేరుకునే సరికి డ్రైవరు కొద్దిపాటి నిద్రమత్తుకు చేరుకున్నట్లు పోలీసుల భావన. ఉదయం 6.30 గంటలకు వేగంగా ఎదురుగా వస్తున్న సరుకురవాణాæ లారీని గమనించలేకపోయాడు. దీంతో అతివేగంగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. కారులోని బెలూన్‌లు తెరుచుకున్నా ఫలితం లేకపోయింది. అది కూడా పగిలి పోయింది. దుర్ఘటనలో మణెమ్మ(48)..సాయికిరణ్‌(19)..వాహన చోదకుడు పవన్‌కల్యాణ్‌(24)  తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందారు.  వాహన చోదకుడు పవన్‌కల్యాణ్‌కు ఏడాది క్రితమే లక్ష్మీ అనే మహిళతో వివాహం జరిగింది. తల్లీకుమారులతోపాటు డ్రైవరు కూడా చనిపోయారనే విషయం కుటుంబ సభ్యులకు తెలిసి నిశ్చేషు్టలయ్యారు. వారంతా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.

                    మృత దేహాల వద్ద  విలపిస్తున్న కుటుంబ సభ్యులు

విదేశం నుండి స్వదేశానికి బయలుదేరి ఇంటికి కూడా చేరకుండా మణెమ్మ మరణించడం గ్రామస్తులను కలచివేసింది. కవల పిల్లలను భగవంతుడు విడదీశాడంటూ రోదించారు. కనీసం లారీ డ్రైవరు కూడా తన వాహనాన్ని అదుపు చేయడంతో విఫలమయ్యాడు. అతను ప్రమాదం జరిగిన వెంటనే  అక్కడి నుండి పరారయ్యాడు. ప్రమాదస్థలానికి చేరుకొన్న ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ సిబ్బందితో కలిసి మృత దేహాలను అతి కష్టం మీద కారునుంచి బయటకు తీశారు.  ఇరుక్కుని పోయిన డ్రైవర్‌ పవన్‌కల్యాణ్‌ కాస్సేపు కొన ఉపిరితో  మృత్యుపోరాటం చేశాడు.  అతనిని కాపాడేందుకు శత విధాల ప్రయత్నించారు. కారు అద్దాలు పగులగొట్టి  బయటకు తీసేలోపే అతను కూడా మరణించాడు.  రైల్వేకోడూరు సీఐ ఆనందరావు ప్రమాద స్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ డాక్టర్‌నాయక్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా