పడిపోయారా.. తోసేశారా.?

6 Mar, 2018 20:17 IST|Sakshi

అనుమానాస్పద రీతిలో తల్లి, కుమారుడు మృతి

ఐదో అంతస్తు నుంచి పడిపోయినట్లు ఆనవాళ్లు

మిస్టరీగా మారిన వ్యవహారం

కాడుగోడిలో ఘటన

సాక్షి, కర్ణాటక(కృష్ణరాజపురం) : అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి పడిపోయి తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన కేఆర్‌.పురం పరిధిలోని కాడుగోడి వార్డులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదగిరికి చెందిన మౌనేశ్‌ (36) కేఎస్‌ ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేస్తుండేవాడు. మూడు సంవత్సరాల కింద తుమకూరు జిల్లా స్పెషల్‌ పోలీస్‌ బృందం సీఐ చంద్రప్ప సోదరితో మౌనేశ్‌కు పరిచయమైంది. బీఎడ్‌ పరీక్షల కోసం మౌనేశ్‌ యాదగిరికి శిక్షణ తీసుకోవడానికి బస్సులో వెళ్తుండగా సీఐ చంద్రప్ప సొదరితో పరిచయం ఎర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. 

కాగా మౌనేశ్‌కు అప్పటికే వివాహమై పిల్లలు ఉండడంతో సీఐ చంద్రప్ప వీరి ప్రేమకు అడ్డు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడికి చంద్రప్ప సోదరి కొంత కాలంగా మౌనేశ్‌కు దూరంగా ఉంటుంది. అయితే కొద్ది రోజుల నుంచి చంద్రప్ప సోదరి కనిపించడం లేదంటూ కాడుగోడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని వెనక మౌనేశ్‌ హస్తం ఉండొచ్చనే అనుమానంతో సీఐ చంద్రప్ప మాట్లాడాలంటూ మౌనేశ్‌తో పాటు అతని తల్లి సుందరమ్మ(60)ను కాడుగోడిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. గత కొన్ని రోజుల నుంచి వారిని చంద్రప్ప గృహనిర్భంధం చేసి సోదరి గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలో సోమవారం రాత్రి మౌనేశ్, సుందరమ్మలు అపార్ట్‌మెంట్‌ నుంచి పడిపోయి మృతి చెందడంతో వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న అదనపు పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌ సింగ్, వైట్‌ఫీల్డ్‌ డీసీపీ అబ్దుల్‌ వహాద్, కాడుగోడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. మృతుల శరీరాలపై గాయాలు ఉండడం అనుమానాలను మరింత పెంచుతోంది. కాడుగోడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు