‘అమ్మ’మ్మలే హతమార్చారు..

22 Jun, 2020 11:40 IST|Sakshi
ఆడశిశువు హత్య కేసులో అరెస్ట్‌ చేసిన నిందితులను చూపుతున్న డీఎస్పీ సత్యనారాయణరావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్‌

ఆడశిశువు భారమనే ఈ ఘాతుకం

శిశువు హత్య కేసులో తల్లి, అమ్మమ్మ, ముత్తమ్మ  అరెస్ట్‌ 

బోసినవ్వుల బుజ్జాయిలను చూస్తే.. ఎవరికైనా ముద్దులాడాలనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో అలసటగా చిరాకుగా ఉన్న వారికి సైతం వారు కనిపిస్తే.. క్షణాల్లో అవన్నీ మాయమైపోతాయి. అభం శుభం తెలియని.. పసిపాపలంటే ఇష్టం లేని వారెవరూ ఉండరు. ఇక గోదావరి వాసులైతే ఆడపిల్ల పుడితే చాలని కనిపించే దేవతలందరికీ మొక్కుతారు. లక్ష్మీదేవితో సమానమని తరతరాలుగా నమ్ముతూ వస్తున్నారు.. ఆడపిల్ల పుట్టింది అనగానే ఆ ఇంట్లో సంబరం అంతా ఇంతా కాదు. బంగారు తల్లి పుట్టిందని మురిసిపోతారు. ఇక అత్త, మామలైతే.. మా ఇంటి కోడలు వచ్చేసిందంటూ తెగ ఆనందపడతారు. మరోవైపు ప్రభుత్వాలు సైతం ఆడపిల్లల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. బేటీ పడావో.. బేటీ బచావో అని పాలకులు సైతం నినాదాలు చేస్తున్న రోజులవి.. కానీ సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో ఓ అమ్మ, అమ్మమ్మ, ముత్తమ్మలు ఆ పసిపాపను భారమనుకున్నారు. నవమాసాలు మోసి కన్న నవజాత శిశువును కనీస మానవత్వం లేకుండా కర్కశంగా చంపేశారు. చివరికి కటకటాలపాలయ్యారు.  

కోరుకొండ: సీతానగరం మండలంలో చినకొండేపూడి గ్రామానికి చెందిన కాళ్ల సతీష్‌, అదే గ్రామానికి చెందిన సృజన దంపతులు 2019 మేనెలలో వివాహమైంది. వీరు ఇక్కడే నివసిస్తున్నారు. భార్యకు నెలలు నిండటంతో భర్త సతీష్‌ ఆమెను రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా ఈనెల 4వ తేదీన ఆడపిల్లకు జన్మినిచ్చింది. ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డలు సురక్షితంగా చినకొండేపూడి గ్రామం చేరుకున్నారు.. పుట్టింటికి చేరిన సృజనకు తన తల్లి మల్లిరెడ్డి మహాలక్ష్మి నుంచి నిరాదరణ ఎదురైంది. ఆడపిల్లకు జన్మనిచ్చావని అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం రావులపాడు నుంచి వచ్చిన సృజన అమ్మమ్మ గంధం కనకరత్నం కూడా ఈ విషయంపై ఆగ్రహంగానే ఉంది. (ఒడి నుంచి మాయమై.. బావిలో శవమై..)

మూడు తరాలుగా వంశంలో ఆడపిల్లలు జన్మించడం సమంజసంగా లేదని, ఆడబిడ్డ భారమని, పెరిగే కొద్దీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కసి పెంచుకుంది. నవజాత శిశువును మునిమనురాలను కడతేర్చాలని నిర్ణయించుకుంది. కనకరత్నం, మహాలక్ష్మి ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉన్న బావిలో ఆడశిశువును హత్య చేసి పడేశారు. అనంతరం బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని కేకలు వేశారు. దీంతో సీతానగరం ఇన్‌చార్జి ఎస్సై పి. విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయగా కోరుకొండ సర్కిల్‌ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. శుక్రవారం తెల్లవారు జామున నవజాత శిశువు కిడ్నాప్‌ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. చిన్నారి ఆచూకీ కోసం గ్రామస్తులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు.  

ఆ ముగ్గురూ..ఇలా దొరికారు...  
శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలు దాటిన తరువాత సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో చిన్నారి చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. అయితే ఈ సంఘటనలో లోతైన దర్యాప్తు చేసిన పోలీసులు కీలక అంశాలను సేకరించారు. ఆడశిశువును ఆమె తల్లి సృజన, అమ్మమ్మ ఎం.మహాలక్షి్మ, ముత్తమ్మ జి.కనకరత్నం హత్యచేసినట్టుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. ఆదివారం కోరుకొండ పోలీసు స్టేషన్‌ వద్ద రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఉత్తర మండలం డీఎస్పీ పి.సత్యనారాయణరావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్‌ వారిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. డీఎస్పీ సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆడబిడ్డ భారమనే భావంతోనే రక్త సంబంధులైన ముగ్గురు మహిళలు కలిపి హత్యకు పాల్పడ్డారన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారని మొగ్గలోనే చిదిమేశారని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్‌ వాసంశెట్టి శ్రీను, గోవిందు, రాము, షేక్‌ వలీ, త్రిమూర్తులు, మహిళా కానిస్టేబుల్స్‌ ఉన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు