ఇటుకతో కొట్టి ఇద్దరు కొడుకులను చంపిన తల్లి

5 Mar, 2019 07:07 IST|Sakshi
పోలీసుల అదుపులో  రమాదేవి, అజయ్, ఆర్యన్‌ మృతదేహాలు

కోల్‌సిటీ(రామగుండం): ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్తబంధం విలువ నీకుతెలియదురా... నుదుటిరాతలు రాసే ఓ బ్రహ్మదేవా.. తల్లికొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా’ అంటూ తన కొడుకు కోసం ‘తల్లి’డిల్లిన పాట ప్రతీతల్లి హృదయాన్ని కలిచి వేస్తుంది. పిల్లలు పుట్టాలని ఎందరో వ్రతాలు చేస్తున్నారు. మహాశివరాత్రికి జాగారం చేస్తున్నారు... పుట్టినబిడ్డ కాలికి రాయి తగితేనే విలవిల్లాడి పోతారు. కానీ గోదావరిఖనిలో ఓ అమ్మ... తన రెండు కనుపాపలను తనే పొడుచుకుంది. ఇటుకతో ఇద్దరు కొడుకులపై విచక్షణ రహితంగా దాడి చేసింది. తలలు పగిలి మెదడు బయటపడేలా కొట్టింది.. ‘అమ్మా.. ప్లీజ్‌ నొప్పిగా ఉందమ్మా... ప్లీజ్‌ కొట్టకమ్మా... అంటూ ప్రాధేయపడినా ఆ తల్లి మనసు కరుగలేదు. గోదావరిఖనిలో సోమవారం జరిగిన ఈ దారుణఘటన ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 

గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్‌–రమాదేవి దంపతులిద్దరూ ఉన్నత విద్యావం తులే. శ్రీకాంత్‌ ఎమ్మెస్సీ బీఈడీ చేయగా, రమాదేవి బీఎస్సీ బీఈడీ చదివింది. వీరి పెద్ద కొడుకు అజయ్‌కుమార్‌(10) 4వ తరగతి, చిన్న కొడుకు ఆర్యన్‌(6) ఎల్‌కేజీ చదువుతున్నారు. శ్రీకాంత్‌ స్థానిక రమేష్‌నగర్‌లోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రమాదేవి కొంత కాలం ప్రైవేట్‌టీచర్‌గా పనిచేసి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటోంది.

చికిత్స పొందుతూ మృతి.. 
తల పగిలి అపస్మారకస్థితిలో ఉన్న అజయ్‌కుమార్‌ చికిత్స ప్రారంభించేలోగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న చిన్న కొడుకు ఆర్యన్‌ను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఐదు గంటలు ప్రాణాలతో కొట్లాడి తుదిశ్వాస విడిచాడు.

కన్నీరుపెట్టిన కాలనీ.. 
ఈ సంఘటన సప్తగిరికాలనీలో రెండు కుటుంబాలతోపాటు కాలనీ ప్రజలను కంటతడిపెట్టించింది. చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అజయ్‌కుమార్, ఆర్యన్‌ మృతదేహాలను పక్కపక్కనే పెట్టిన ఈ దృశ్యం కుటుంబ సభ్యులతోపాటు, స్థానిక ప్రజలను కన్నీరు పెట్టించింది.  సాయంకాలానికి అన్నదమ్ములిద్దరికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

అమ్మచేత అన్నం తినకుండానే కన్నుమూశారు 
సోమవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే గంగస్నానం చేసి వచ్చి సంతోషంగా అమ్మ చేత అన్నం తినాలని పిల్లలు సంతోషపడ్డారు. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలని ఎదురుచూశారు. గురుకులంలో పనిచేసిన శ్రీకాంత్‌ ఆదివారం రాత్రి అక్కడే బస చేసి సోమవారం ఉదయం ఇంటికి పూజా సామగ్రితోపాటు పిల్లలకు అల్పాహారం, పండ్లు తీసుకువచ్చాడు. కానీ అప్పటికే ఇంట్లో జీవచ్ఛవాలుగా పడి ఉన్న కొడుకులిద్దరినీ చూసి గుండెలవిసేలా రోదించాడు. 

కనికరించని తల్లిమనసు.. 

పిల్లలిద్దరూ బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేసిన రమాదేవి కొడుకులపై ఒక్కసారిగా దాడి చేసింది. ఇటుకతో అజయ్‌కుమార్, ఆర్యన్‌ తలలపై విచక్షణారహితంగా కొట్టింది. ప్లీజ్‌ మమ్మీ.. నొప్పిగా ఉంది.. కొట్టకు మ మ్మీ.. అంటూ కొడుకులిద్దరూ ప్రాధేయపడు తూ దెబ్బలకు తట్టుకోలేక విలవిల్లాడిపో యారు. అప్పటికే తలలు పగిలి రక్తం కారుతున్నా పిల్లలను చూసినా ఆ తల్లి మనసు కనికరించలేదు. తలలు పగిలి కుప్పకూలారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకులిద్దరిని తండ్రితోపాటు స్థానికులు గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

కొడుకులను చంపిన ఆవేశం

దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శ్రీకాంత్‌ తల్లిదండ్రులు, రమాదేవి తల్లిదండ్రులు కలిసి సప్తగిరికాలనీలో ఓ ఇంటిని కొనుగోలు చేసి శ్రీకాంత్‌–రమాదేవికి ఇచ్చారు. అయితే తండ్రితో చనువుగా ఉంటున్న ఇద్దరు కొడుకులు తనతోమాత్రం సరిగా ఉండడం లేదని పిల్లలపై రమాదేవి కోపం పెంచుకునేదని శ్రీకాంత్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నా డు. అదే ఆవేశం కొడుకుల ప్రాణంతీసింది. 

అమ్మా మాకెందుకీ శిక్ష!

పెద్దపల్లి: అదిగో శివ నామస్మరణం.. ఇంటింటా శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు.. తమ్ముడూ ఆర్యన్‌ లే.. నిన్నే కాదు అమ్మ నన్ను కూడా కొట్టింది.. నా తల పగిలి రక్తం కారుతోంది.. నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు ఒక శివనామస్మరణ తప్ప.. జోల పాడిన అమ్మ మనకెందుకు మరణశిక్ష విధించింది.. నవమాసాలు మోసి కన్న మమ్ముల్ని తప్పటడుగులు వేసినప్పుడు కాలు జారి కింద పడితేనే విలవిల్లాడిన అమ్మ ఇటుకరాయితో నిన్ను బాదుతుంటే అడ్డం వచ్చిన నా తలపైనా కొట్టింది.

లేరా తమ్ముడు అన్నయ్య అజయ్‌ శివాలయానికి వెళ్దాం.. శివపూజలు చేద్దాం.. అమ్మ మనసు మార్చమని వేడుకుందాం.. ఆగండి, మా తమ్ముడిని ఎటు తీసుకెళ్తున్నారు.. ఆస్పత్రి వద్దు మాకేం కాలేదు.. గోరుముద్దలు తినిపించిన అమ్మ కొట్టిన దెబ్బలు మమ్మల్నేం చేయలేవు.. ఎన్నో రోజులు ఉపవాసం ఉండి మాకు స్వీట్లు తినిపించిన అమ్మ ఇప్పుడు మమ్ముల్ని రాయితో కొట్టి రక్తం కళ్ల చూసింది..  ఊపిరి ఆడడం లేదు.. కనుచూపు కనిపించడం లేదు.. అదిగో డాక్టర్లు వచ్చి తమ్ముడిని, నన్నూ కోసి మూటగట్టి నాన్నకు అందజేస్తున్నారు. ఏడవకండి పండగ పూట మా కన్నీళ్లు మీకు శివరాత్రి జాగరణగా మార్చాయని తెలుసు. అందరినీ విడిచి.. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నాం. – అజయ్, ఆర్యన్‌ల ఆత్మఘోషకు అక్షరరూపం  

పోలీసుల అదుపులో నిందితురాలు

రమాదేవిని వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పిల్లలను విచక్షణారహితంగా కొట్టిన తర్వాత, రమాదేవి ఇంట్లోకి వెళ్లి గ్యాస్‌ లీక్‌ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసిందని రమాదేవి తండ్రి పాపయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇద్దరి మనమళ్లను ఎందుకు కొట్టి చంపాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపాడు. సంఘటనాస్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్‌టౌన్‌ సీఐ పర్శ రమేశ్‌ పరిశీలించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు.శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు