భర్త ఎడబాటు భరించలేక..

9 Oct, 2018 13:32 IST|Sakshi
భర్త కోటేశ్వరరావు, పిల్లలు జనార్దన్, విజయలక్ష్మిలతో మాధవీలత (ఫైల్‌)

బిడ్డలకు విషమిచ్చి భార్య ఆత్మహత్యాయత్నం

కుమార్తె మృతి

తల్లీకొడుకుల పరిస్థితి విషమం

పేర్నమిట్ట శాంతినగర్‌లో ఘటన

సూసైడ్‌నోట్‌ను బయటపెట్టని పోలీసులు

అన్యోన్య దాంపత్యం.. రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డలు.. ఎలాంటి చీకూచింత లేకుండా సాగిపోతున్న వారి జీవితాలను కుటుంబ పెద్ద మృతి కలచివేసింది. భర్త ఎడబాటు భరించలేని భార్య తీవ్ర మనోవేదనకు గురైంది. ఆయన లేని జీవితం ఎందుకు అనుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడింది. తాను కూడా లేకపోతే బిడ్డలు ఒంటరి అవుతారని భావించింది. వారికి విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. అమ్మ చేత్తో ఇచ్చిన శీతలపానీయం తాగి కొద్దిసేపటికే ఎనిమిదేళ్ల చిన్నారి విగతజీవిగా మారింది. అపస్మారక స్థితిలో ఉన్న తల్లీకొడుకును బంధువులు ఆస్పత్రికి తరలించగా వారు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన సోమవారం వేకువజామున సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో చోటుచేసుకుంది.

ప్రకాశం, చీమకుర్తి: పేర్నమిట్ట శాంతినగర్‌లో నివాసం ఉండే మిడసల కోటేశ్వరరావు (అల్లూరి కోటి), మాధవీలత దంపతులది అన్యోన్య దాంపత్యం. వారికి ఇద్దరు బిడ్డలు. కుమారుడు జనార్దన్‌ 7వ తరగతి చదువుతుండగా.. కుమార్తె విజయలక్ష్మి (8) 4వ తరగతి చదువుతోంది. హాయిగా సంసారం సాగిపోతున్న తరుణంలోకోటేశ్వరరావు అనుకోని కష్టం వచ్చింది. ఆరు నెలల కిందట కోటేశ్వరరావు తలకు దెబ్బతగలడంతో ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అతను మృతిచెందాడు. భర్త మృతిని జీర్ణించుకోలేని మాధవీలత మనోవేదనకు గురైంది. మానసికంగా కుంగిపోయింది. ఇంటి వెనకే నివాసం ఉండే తల్లిదండ్రులతో భర్త లేని జీవితం ఎందుకని, తాను కూడా చనిపోతానని తరచూ అంటూ ఉండేది.

ఈక్రమంలో ఆదివారం రాత్రి బిడ్డలిద్దరితో ఇంట్లో నిద్రించిన మాధవీలత బిడ్డలతో సహా చనిపోవాలని నిర్ణయించుకుంది. సోమవారం వేకువజామున శీతల పానీయంలో విషం కలిపి పిల్లలిద్దరికీ ఇచ్చింది. అది కూల్‌డ్రింకే అనుకొని విజయలక్ష్మి గటగటా తాగేసింది. జానార్దర్‌ మాత్రం కొంచెం తాగి చేదుగా ఉందంటూ పారబోశాడు. ఇంకొంచెం తాగాలంటూ బలవంతంగా తల్లి తాగించే ప్రయత్నం చేస్తూ తానూ తాగేసింది. తల్లి ఒత్తిడితో జనార్దన్‌ ఏడ్వడం ప్రారంభించాడు. మనవడి ఏడ్పు విని ఏమైందా అని చూసేందుకు వచ్చిన మాధవీలత తల్లిదండ్రులు అక్కడ కూల్‌డ్రింక్‌ సీసాలు, గ్లాసులు చూసి జరిగింది ఊహించారు. వారు ఆ షాక్‌ నుంచి తేరుకునే లోపే విజయలక్ష్మి చావుకు చేరువైంది. వాంతులు, విరేచనాలై కొద్దిసేపటికే మృతిచెందింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మాధవీలత, జనార్దన్‌ను ఒంగోలులోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఒంగోలు తాలూకా సీఐ జీ.వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రసాద్‌ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మాధవీలత సోదరుడు దాసరి వెంకట శేషయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

సూసైడ్‌ నోట్‌ లభ్యం..
ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులకు మాధవీలత రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆమె ఆదివారం రాత్రి ఉరివేసుకుని చనిపోవాలని ప్రయత్నించి ఉంటుందని ఇంట్లో సీలింగ్‌కు వేలాడుతున్న చీరను బట్టి పోలీసులు నిర్దారణకు వచ్చారు. కానీ సూసైడ్‌ నోట్‌లోని విషయాన్ని మాత్రం బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ నోట్‌ను తీసుకున్న పోలీసులు దానిని సీసీఎస్‌ స్టేషన్‌కు పరీక్షల నిమిత్తం పంపించామని, దానిలో సారాంశం పూర్తిగా చూడలేదని గోడమీద పిల్లివాటంగా సమాధానం ఇచ్చారు.

పోలీసుల తీరుపై అనుమానాలు..
స్నేహితులు పార్టీకి పిలిచారు అని ఇంట్లో చెప్పి వెళ్లిన కోటేశ్వరరావు ఆరునెలల కిందట ఒంగోలులోని ఏ–1 ఫంక్షన్‌ హాలు వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. రాత్రి పూట మద్యం మత్తులో పడి ఉన్న అతడిని గస్తీ తిరిగే పోలీసులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలో కోటేశ్వరరావు తలకు బలమైన గాయాలు కావడంతో గుంటూరు ఆస్పత్రికి తరలించి మెదడుకు ఆపరేషన్‌ చేయించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే పరిస్థితి విషమించడంతో కోటేశ్వరరావు మృతి చెందాడు. పార్టీకి పిలిచిన బండ్లమిట్టకు చెందిన వారే తన భర్తతో మద్యం తాగించి, కొట్టి ఉంటారని, తన భర్త చావుకు వారే కారణమని మాధవీలత సూసైడ్‌నోట్‌లో రాసినట్లు సమాచారం. ఫలానా వాళ్లు అని కొందరు అనుమానితుల పేర్లు కూడా పేర్కొన్నట్టు తెలిసింది. కానీ పోలీసులు మాత్రం సూసైడ్‌నోట్‌ గురించి పూర్తిగా మీడియాకు వెల్లడించకపోవడం అనుమానాలకు కారణమైంది. మాధవీలత ఘటనకు ముందు తన రెండు చేతులపై భర్త, పిల్లల పేర్లు రాసుకుంది. లవ్యూ అంటూ వారిపై తనకున్న ప్రేమను వ్యక్త పరిచింది.

మరిన్ని వార్తలు