పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్యాయత్నం

6 Oct, 2018 01:48 IST|Sakshi

సాగర్‌ కాల్వలో దూకిన తల్లి  

ఇద్దరు చిన్నారులు మృతి, మరో చిన్నారి గల్లంతు 

తల్లిని రక్షించిన స్థానికులు 

త్రిపురారం : ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలసి సాగర్‌ ఎడమకాల్వలో దూకింది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో బాబు గల్లంతయ్యాడు. కాల్వలో కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దామరచర్ల మండలం గోన్యాతండాకు చెందిన ధనావత్‌ హరి, బుజ్జి దంపతుల పెద్ద కుమార్తె స్వాతిని తిరుమలగిరి మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆంగోతు మోహన్‌కి ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి సాత్వీక(7), కవల పిల్లలైన మధునశ్రీ (5), మమంత్‌కుమార్‌ (5) ఉన్నారు. ఏడాదిన్నరనుంచి హాలియాలోని వీరయ్యనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

మోహన్‌ పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, మోహన్, స్వాతిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మోహన్‌ మద్యం మత్తులో రోజూ స్వాతిని హింసించేవాడు. అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురిచేస్తుండేవాడు. గొడవలు జరిగినప్పుడల్లా స్వాతి తన తల్లిదండ్రుల చెప్పడంతో వారు తమ బిడ్డకు నచ్చజెప్పి పంపేవారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం మోహన్‌ విధులకు వెళ్లాడు. భర్తలో మార్పు రావడం లేదని కుమిలిపోయిన స్వాతి తనువు చాలించాలని భావించింది. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి స్కూల్‌ వెళ్లి తన ముగ్గురు పిల్లలను ఇంటికి తీసుకువచ్చింది. స్కూల్‌డ్రెస్‌ తీయకుండానే హాలియాలోని మసీదు వద్ద ఉన్న ఎడమ కాల్వ వద్దకు వెళ్లి తన ముగ్గురు పిల్లలతో కలసి దూకింది. 

స్వాతిని కాపాడిన ఎంపీటీసీ, పోలీసులు 
తల్లి, ముగ్గురు చిన్నారులు కాల్వలో కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన స్థానిక ఎంపీటీసీ సభ్యుడు చెరుపల్లి ముత్యాలు, పోలీస్‌ సిబ్బంది నసీరోద్దీన్, మునినాయక్‌తోపాటు మరో ఐదుగురు యువకులు కాల్వలోకి దూకి స్వాతితోపాటు సాత్వీక, మధునశ్రీలను ఒడ్డుకు చేర్చారు. మరో బాలుడు మమంత్‌కుమార్‌ గల్లంతయ్యాడు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. స్వాతికి ప్రథమ చికిత్స చేసి స్థానిక యశోద ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. 
 

మరిన్ని వార్తలు