ఏం కష్టమొచ్చిందో..!

22 Sep, 2019 06:43 IST|Sakshi
తమ ఇంట్లో అపస్మారకస్థితిలో పడిఉన్న తల్లీకూతురు లక్ష్మి, గిరిజా ప్రసన్నరాణి

పురుషోత్తపురంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

తల్లి మృతి..కుమార్తె పరిస్థితి విషమం

భార్య, కుమార్తెల పరిస్థితి చూసి కంగారులో జారిపడి తీవ్రంగా గాయపడ్డ భర్త

సాక్షి, పెందుర్తి: ఏం కష్టమొచ్చిందో ఏమో తల్లీకూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తల్లి పరిస్థితి విషమించి మృత్యువాత పడగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. భర్త బయట నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమార్తె అపస్మారకస్థితిలో పడి ఉండడం చూసి కంగారులో అటూఇటూ పరిగెడుతూ జారిపడడంతో అతనూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషాద ఘటన పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జీవీఎంసీ 70వ వార్డు పురుషోత్తపురం సమీపంలోని గోకుల్‌ధామ్‌కాలనీలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు...వ్యవసాయశాఖ విశ్రాంత అధికారి మేడేదల దివాకర్, లక్ష్మి (56) దంపతులు. గోకుల్‌ధామ్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె గిరిజా ప్రసన్నరాణి భర్త కొన్నాళ్ల క్రితం మరణించడంతో ఆమె కూడా వీరితో పాటే ఉంటోంది. గిరిజ ఓ ప్రవేటు పాఠశాలలో పనిచేసి ఇటీవల మానేసింది. కాగా దివాకర్‌ శనివారం ఉదయం మెడికల్‌ రిపోర్ట్‌ల కోసం ఆసుపత్రికి వెళ్ళాడు.

మంచినీరు సరఫరా చేసే వ్యక్తి మధ్యాహ్నం దివాకర్‌ ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎవరూ బయటకు రాలేదు. అనుమానం వచ్చి అతను కిటికిలో నుంచి చూడగా తల్లీకూతుళ్లు లక్ష్మి, గిరిజ ఇంటి హాల్‌లో అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆ వ్యక్తి స్థానికులను పిలవగా వారు 100 డయల్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి 108 ద్వారా ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో లక్ష్మి మృతి చెందింది. గిరిజను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు తాగి వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు బయటకు వెళ్లిన దివాకర్‌కు పోలీసులు ఇంటి వద్ద పరిస్థితిపై సమాచారం ఇవ్వగా ఆయన ఇంటికి వచ్చారు. భార్య, కుమార్తెల పరిస్థితి చూసి హడలిపోయారు. పరిగెత్తుకుంటూ వెళ్లిన క్రమంలో జారి కిందపడిపోయారు. దీంతో ఆయన పక్కటెముక విరిగిపోయింది. దివాకర్‌ను కూడా అదే 108లో ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు