కూతురి వెంటే తల్లి..

24 Oct, 2019 07:45 IST|Sakshi
రెండు రోజుల క్రితం పాతపట్నం మోడల్‌ స్కూల్‌లో మృతి చెందిన పూర్ణ (ఫైల్‌) కూతురి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన అరుణ

కుమార్తె మృతిని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన మాతృమూర్తి

టెక్కలి (శ్రీకాకుళం): గుండెల నిండా మాతృప్రేమ నింపుకున్న అమృత మూర్తి ఆ తల్లి.. అక్క మరణించడంతో ఆమె పిల్లల కోసం బావను పెళ్లాడి, వారిని ఒకింటి వాళ్లను చేసింది.. ప్రభుత్వ మోడల్‌ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తన కూతురిపై ఆశలు పెట్టుకొని బతుకుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్లో కుమార్తె మరణించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె బుధవారం ఉదయం గుండె ఆగి మరణించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ పరిధి మెట్ట పేట గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తన అక్క ఆకస్మికంగా మరణించడంతో గుంట అరుణ (35) అక్క భర్తను పెళ్లి చేసుకుంది. బావ సరిగా చూడనప్పటికీ తల్లి మరణంతో దిక్కు లేకుండా ఉన్న ఇద్దరు ఆడ పిల్లలను పెంచి పెద్ద చేసింది. కూలి పనులు చేసుకుంటూ వారిద్దరికీపెళ్లిళ్లు చేసింది.

అలాగే తనకు జన్మించిన కుమార్తెను ఉన్నత స్థితిలో చూడాలని పాతపట్నం మోడల్‌ స్కూల్లో చదివిస్తోంది. పద్నాలుగేళ్ల కూతురు పూర్ణ సోమవారం హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మృతిని తట్టుకోలేక అరుణ దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. రెండు రోజులుగా పచ్చి మంచినీళ్లు తీసుకోకుండా కంటి మీద కునుకు లేకుండా గడిపింది. మంగళవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రించిన తరువాత ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంది. బుధవారం అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆమెను వైద్యం చేస్తుండగా మృతి చెందింది. హృద్రోగంతో చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా