వేధింపులే తల్లీబిడ్డల ప్రాణం తీశాయి

23 Mar, 2020 13:12 IST|Sakshi
భర్త ఓబులేశుతో పద్మావతి (ఫైల్‌)

వివాహిత, ముగ్గురు పిల్లల

మృతిపై పుంగనూరు సీఐ గంగిరెడ్డి వెల్లడి  

చిత్తూరు, పుంగనూరు : చెడు అలవాట్లకు బానిసైన భర్త వేధింపులు తాళలేక ముగ్గురు పిల్లలను బావిలో వేసి భార్య దూకి ఆత్మహత్య చేసుకుందని సీఐ గంగిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం రాత్రి పుంగనూరు సమీపంలోని ప్రసన్నయ్యగారిపల్లె వద్ద వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలను కనుగొన్నామన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టగా, అనేక విషయాలు వెలుగు చూశాయని చెప్పారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం పుంగనూరు మేలుపట్లకు చెందిన ఓబులేశుతో కర్ణాటక రాష్ట్రం కాడేపల్లె గ్రామానికి చెందిన పద్మావతికి పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు సంచారజీవులు. జీవనోపాధి కోసం పట్టణాలకు వెళ్లి గుడారాలు వేసుకుని జీవించేవారు. ప్రస్తుతం  పలమనేరు పట్టణం పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద గుడారాల్లో నివాసం ఉండేవారు. ఓబులేశు, అతని భార్య మారెమ్మ అనే పద్మావతి(30 ) దంపతులకు  ముగ్గురు పిల్లలు. సంజయ్‌కుమార్‌ (6) ఒకటో తరగతి చదువుతున్నాడు. పవిత్ర (3), ఒకటిన్నర సంవత్సరం పాపకు పేరు ఇంక పెట్టలేదు.

ఓబులేవు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. భార్యను తరచూ కొట్టి, వేధించేవాడు. పద్మావతి ఎంతో సహనంతో ఉంటూ వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో  పిల్లలను పోషించుకుంటుండేది. గత ఆదివారం పద్మావతి పిల్లలతో కలసి రామసముద్రం మండలం మినికి గ్రామంలో ఉన్న అమ్మమ్మ లక్ష్మమ్మ, మేనేత్త ఆంజమ్మ ఇళ్లకు వెళ్లింది. మేనత్తకు, అమ్మమ్మకు ఆమె భర్త  వేధింపుల గురించి తెలిపింది. ఆంజమ్మ సూచనల మేరకు పద్మావతి పిల్లలను తీసుకుని పుంగనూరు జాతర చూసుకుని పలమనేరులోని ఇంటికి వెళ్తానని చెప్పి మంగళవారం బయలుదేరింది. మార్గం మధ్యలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె పలమనేరుకు వెళితే భర్త వేధింపులు తట్టుకుని జీవించలేమని భావించింది. పుంగనూరు పట్టణ సమీపంలోని బావి వద్దకు వెళ్లి బ్యాగును గట్టుపై పెట్టి, పిల్లలను బావిలో వేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది.   నిందితుడు ఓబులేశు పరారీలో ఉన్నాడు. కుటుంబసభ్యులను విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. నలుగురి శవాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు