అంబులెన్స్‌ ఇవ్వక కొడుకు శవంతో నడక 

28 May, 2019 08:54 IST|Sakshi
కొడుకు శవాన్ని మోస్తున్న తల్లి

లక్నో : ప్రభుత్వాలు ఎన్ని మారినా, నాయకులు ఎంతమంది వచ్చినా పేదల బతుకులు మాత్రం మారడం లేదనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం. డబ్బుల్లేక, ఆసుపత్రి వర్గాలు అంబులెన్స్‌ ఇవ్వక ఓ మహిళ తన కుమారుడి శవాన్ని భుజాలపై మోసుకుంటు వెళ్లిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాహజాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు కండిషన్‌ సీరియస్‌గా ఉందని ఇతర ఆసుపత్రికి రిఫర్‌ చేశారని ఆ చిన్నారి తండ్రి తెలిపారు. అయితే తమ దగ్గర చిల్లి గవ్వలేకపోవడంతో అంబులెన్స్‌ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కాళ్లవేలా ప్రాధేయపడ్డామని, అయినా వారు కనికరించలేదన్నారు. దీంతో చేసేదేంలేక తన కొడుకును భుజాలపై వేసుకుని నడక సాగించామన్నారు. ‘నా భుజాలపై ఉన్న నా బిడ్డ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు’ అని మృతుడి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఆసుపత్రివారు అంబులెన్స్‌ ఇచ్చి ఉంటే తన కొడుకు బతికేవాడని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆసుపత్రి ముందు మూడు అంబులెన్స్‌లు పార్క్‌ చేసి ఉన్నాయని, అయినా తమకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదన్నారు.
 
ఇక ఆసుపత్రి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాయి. మెడికల్‌ అధికారి అనురాగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ చిన్నారి పేరు అఫ్రోజ్‌, అతన్ని రాత్రి 8.10 గంటలకు ఆసుపత్రి తీసుకొచ్చారు. అప్పటికే అతన్ని పరిస్థితి చాలా విషమంగా ఉంది. మేం వెంటనే లక్నోకు తీసుకెళ్లి చికిత్స అందించమని చెప్పాం. వారు మా ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్తామని చెప్పి ఆ పిల్లాడిని తీసుకువెళ్లారు. ఇప్పుడు అనవసర ఆరోపణలు చేస్తున్నారు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు