చిన్నారిని చిత్రహింసలు పెట్టిన తల్లి

16 Jul, 2019 08:27 IST|Sakshi
చిన్నారి ఇందు , చేయి, కాలుపై వాతలు చూపుతున్న చిన్నారి

సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి ఛాతీ, కాళ్లు, చేతులపై వాతలు  

పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పాఠశాల

హెచ్‌ఎం, గ్రామస్తులు  

అశ్వారావుపేటరూరల్‌: అభం శుభం తెలియని చిన్నారిని.. కన్న తల్లే కసాయిగా మారిపోయి, తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. వైర్లతో కొట్టి, ఒంటిపై కాల్చి, కాళ్లు, చేతులపై వాతలు పెట్టింది. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ అమానుష చర్యలు సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చాయి. బాధిత చిన్నారి, గ్రామస్తుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం గాండ్లగూడేనికి చెందిన భూక్యా మంగకు గణేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఇందు(11), ఆశ్విత(6) ఉన్నారు. రెండేళ్ల క్రితం గణేష్‌ చనిపోయాడు. అప్పటి నుంచి మంగ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాడువాయి గ్రామానికి చెందిన భూపతిరాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తాడువాయిలోనే ఉంటున్న మంగ.. తన పెద్ద కూతురు ఇందును అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామంలోగల ఐటీడీఏ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించింది. ఐదో తరగతి చదువుతున్న ఇందు గడిచిన దసరా సెలవుల సమయంలో తల్లి వద్దకు వెళ్లింది.

అప్పటి నుంచి అక్కడే ఉంటున్న చిన్నారిని అ కారణంగా తల్లి, సహజీవనం చేస్తున్న వ్యక్తి కలిసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. చిత్రహింసలు భరించలేక చిన్నారి మూడు రోజుల క్రితం అమ్మమ్మ నివాసమైన గాండ్లగూడేనికి పారిపోయి వచ్చింది. అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్న ఇందును ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం కృష్ణకుమారి పాఠశాలకు తీసుకొచ్చి, ఆశ్రమ పాఠశాలలో ఉంచారు. సోమవారం మధ్యాహ్న సమయంలో ఇందు తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి వచ్చి టీసీ ఇవ్వాలని హెచ్‌ఎంపై ఒత్తిడి చేశారు. టీసీ ఇచ్చేందుకు హెచ్‌ఎం సిద్ధం కాగా.. వారితో వెళ్లేందుకు చిన్నారి ఒప్పుకోలేదు. వారు పెడుతున్న చిత్రహింసల గురించి తోటి విద్యార్థినులకు చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ విషయాన్ని విద్యార్థినులు హెచ్‌ఎం దృష్టికి తేగా.. ఆమె చిన్నారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, భూపతిరాజు అనే వ్యక్తి పెడుతున్న చిత్రహింసలను గురించి చెబుతూ చిన్నారి బోరున విలపించింది. ఆ తర్వాత హెచ్‌ఎం, గ్రామస్తులు ఇందును స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి సమస్యను వివరించారు. కేసు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వస్తుందని, అక్కడి ఠాణాలోనే ఫిర్యాదు చేయాలని స్థానిక పోలీసులు చెప్పారు. 

మరిన్ని వార్తలు