ఎంత పని చేశావు తల్లీ ! 

5 Mar, 2019 02:50 IST|Sakshi
అజయ్‌కుమార్, ఆర్యన్‌ (ఫైల్‌)

‘ఖని’లో పండుగ పూట దారుణం

ఇద్దరు కుమారుల తలపై ఇటుకతో కొట్టి కడతేర్చిన కన్నతల్లి 

తనతో ప్రేమగా ఉంటున్నారన్న కోపమే కారణమన్న భర్త 

నిందితురాలి మానసిక స్థితి సరిగా లేదని అనుమానాలు 

కోల్‌సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మహాశివరాత్రి పండుగ పూట దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి.. పేగు తెంచుకుని పుట్టిన తన ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరు మృతి చెందారు. పిల్లలిద్దరూ తనతో ప్రేమగా, చనువుగా ఉండటం తట్టుకోలేక తన భార్య వారిపై దాడి చేసిందని తండ్రి ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

మేనరికం.. ఉన్నత విద్యావంతులు.. 
గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్, రమాదేవి దంపతులు. ఇందులో రమాదేవి తండ్రి.. శ్రీకాంత్‌ తల్లి అన్నాచెల్లెళ్లు కావడంతో మేనరికం కుదరగా 2003 నవంబర్‌ 4న ఇరువురికి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అజయ్‌(10), ఆర్యన్‌(6) ఉన్నారు. శ్రీకాంత్‌ స్థానికంగానే ప్రభుత్వ మైనార్టీ గురుకులంలో కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, రమాదేవి కొంతకాలం ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసి ప్రసుతం ఇంటి వద్దే ఉంటోంది. వీరి పిల్లలు అజయ్‌ 4వ తరగతి, ఆర్యన్‌ ఎల్‌కేజీ చదువుతున్నారు.  

దంపతుల మధ్య గొడవలు.. 
కొంతకాలంగా శ్రీకాంత్, రమాదేవిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు తండ్రి శ్రీకాంత్‌తో చనువుగా ఉంటున్నారని తరచూ చెప్పుకునే రమాదేవి.. కొడుకులను అదే కారణంతో కొట్టేదని చెబుతున్నారు. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైనార్టీ గురుకులంలో పని చేస్తున్న శ్రీకాంత్‌ ఆదివారం రాత్రి విద్యార్థులకు పాఠాలు బోధించి అక్కడే పడుకున్నాడు. సోమవారం ఉదయం నిర్మాణంలో ఉన్న తన తండ్రి ఇంటిని పరిశీలించి అక్కడి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో భార్య రమాదేవికి ఫోన్‌ చేశాడు. శివరాత్రి పూజ కోసం పండ్లు, సామాగ్రి తీసుకురావాలా అని అడిగి ఆమె సూచన మేరకు పూజా సామాగ్రితోపాటు పిల్లలకు తినడానికి అల్పాహారం కూడా తీసుకొని ఇంటికొచ్చాడు.  

గట్టిగా కొట్టడంతో.. 
శ్రీకాంత్‌ ఇంటికి రాకముందే రమాదేవి ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణా రహితంగా దాడి చేయగా తలలు పగిలిపోవడంతో కొడుకులిద్దరూ కుప్పకూలారు. ఇంటికి చేరుకున్న శ్రీకాంత్‌ పిల్లలను పిలిస్తే సమాధానం రాకపోగా, గేటుకు లోపలివైపు గడియపెట్టి తాళం వేసి ఉండడంతో అనుమానిం చాడు. స్థానికులను పిలిచి గోడ దూకి ఇంటి ఆవరణలోకి శ్రీకాంత్‌ వెళ్లే సరికి పిల్లలిద్దరూ తలలు పగిలి రక్తపు మడుగులో మూలుగు తూ కనిపించారు. పక్కనే రక్తంతో తడిసి పగిలిన ఇటుక కనిపించింది. భార్య చేతికి రక్తం మరకలు ఉన్నాయి. దీంతో స్థానికులు తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను గోదావరిఖలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.  

చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి 
తీవ్రంగా గాయపడిన పెద్ద కుమారుడు అజయ్‌ చికిత్స పొందుతూ గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు.  చిన్న కుమారుడు ఆర్యన్‌కు కూడా తలకు బలమైన గాయాలు కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ 
సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్‌టౌన్‌ సీఐ పర్శ రమేశ్‌ పరిశీలించారు. మృతుల తండ్రి శ్రీకాంత్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు