‘కథువా’ బాలిక తల్లి సంచలన వ్యాఖ్యలు

6 May, 2018 13:15 IST|Sakshi
బనిహాల్‌లో తాత్కాలిక గుడారాల్లో జీవిస్తోన్న ‘కథువా’ బాధిత కుటుంబం.

బనిహాల్‌(జమ్ముకశ్మీర్‌): ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి కీలక తీర్పులు వెలువడనున్నాయి. కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలన్న బాధిత కుటుంబం అభ్యర్థన, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాన్న నిందితుల డిమాండ్‌.. ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం ప్రకటించనుంది. కాగా, తమ కుటుంబానికి జరిగిన దారుణాన్ని తలుచుకుంటూ మృతురాలి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మమ్మల్ని కాల్చిచంపండి: కథువాలో దారుణ సంఘటన, అనంతర పరిణామాల తరువాత బాధిత కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. ప్రస్తుతం వారు కథువాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిహాల్‌(రంబాన్‌ జిల్లా)లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. కనీస అవసరాలు కూడా లేని చిన్న గుడారంలో కాలం వెళ్లదీస్తోన్న ఆ కుటుంబం.. ఇప్పటికీ భయంతో వణికిపోతున్నది. ‘‘నా బిడ్డను పొట్టనపెట్టుకున్న ఆ దుర్మార్గులు బయటికొస్తే మిగిలిన మా నలుగురినీ(తను, భర్త, ఇద్దరు పిల్లు) చంపేస్తారు. మాకు కావాల్సిందల్లా న్యాయమే. ఒకవేళ న్యాయం చేయలేరనుకుంటే మమ్మల్ని కాల్చిచంపేయండి’’ అని కన్నీటిపర్యంతం అయిందా తల్లి.

అమాయకులు కాదు.. దుర్మార్గులు: రసానాలో తాము గడిపిన రోజులు నిజంగా భయంకరమైనవని, సాంజీరామ్‌(బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు) కుటుంబీకులు చాలా క్రూరంగా ప్రవర్తించేవారని మృతురాలి తల్లి గుర్తుచేశారు. ‘‘ ఊరి బయట పచ్చికలోనూ మా పశువుల్ని మేపనిచ్చేవారు కాదు. చివరికి నా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. అక్కడ(రసానాలో) మాకున్న ఇల్లు, ఆస్తి అంతా ధ్వంసమైపోయింది. కోర్టులో చెప్పుకున్నట్టు వాళ్లేమీ(నిందితులేమీ) అమాయకులు కాదు. పచ్చి దుర్మార్గులు. వాళ్లను ఉరితీయాల్సిందే. పొరపాటున బయటికొస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు’’ అని బాలిక తల్లి అన్నారు.

పశువుల పెంపకమే వృత్తిగా జీవించే బకర్వాల్‌ సంచార తెగకు చెందిన కుటుంబాలు.. చాలా కాలం కిందటే కథువా ప్రాంతంలో శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. విశాలమైన పచ్చకబయళ్లున్న ఆ ప్రాంతంలో తమ గొర్రెలు, మేకలు, గుర్రాలను మేపేవారు. ముస్లిం తెగల వ్యాప్తిని జీర్ణించుకోలేని స్థానికులు కొందరు.. బకర్వాల్‌లను అక్కడి నుంచి వెళ్లగొట్టాలనుకున్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే.. ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి, కొద్దిరోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారం జరిపి, చివరికి కొట్టిచంపేశారు. జమ్ముకశ్మీర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఈ విషయాలను పేర్కొన్నారు. అయితే, తాము అమాయకులమని, చిన్నారి మరణంతో ఎలాంటి సంబంధంలేదని నిందితులు వాదిస్తున్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని, ఆమేరకు సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ వేశారు. అటు బాధిత కుటుంబం సైతం కేసును జమ్ముకశ్మీర్‌ నుంచి బయటికి తరలించి విచారించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు