మంటగలిసిన మాతృత్వం

19 Jun, 2019 07:14 IST|Sakshi
ముగ్గురు పిల్లల మృతదేహాలు, పక్కనే ఉరికి వేలాడుతున్న తల్లి మల్లమ్మ

ముగ్గురు పిల్లలను నీటిలో ముంచి హత్య చేసిన తల్లి

తరువాత ఉరివేసుకుని తానూ ఆత్మహత్య  

తాగుబోతు భర్త వేధింపులతో ఘోర నిర్ణయం  

కొప్పళ జిల్లా ఎరహంచినాళ గ్రామంలో విషాదం

ఎప్పటిలాగానే ఆ పల్లె తెల్లారింది. నలుగురి జీవితాలు కూడా తెల్లారిపోయాయి. ఎంత కష్టమొచ్చినా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కిరాతకురాలిగా మారింది. తాగుబోతు భర్త వేధింపులను తట్టుకోలేనంటూ ముగ్గురు పిల్లలనూ తన చేతులతోనే చంపేసి, ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం కొప్పళ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పల్లె నిండా విషాదం అలముకొంది. 

సాక్షి బళ్లారి/ గంగావతి రూరల్‌: కొప్పళ జిల్లాలో ఘోరం జరిగింది. భర్త నిత్యం మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు వేధిస్తుండడంతో విసిగిపోయిన ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలను నీటిలో ముంచి హత్య చేసింది. తరువాత తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న గుండెలు పిండివేసే సంఘటన చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి కుకనూరు తాలూకా ఎరెహంచినాళ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. మృతులు మల్లమ్మ (30), ఆమె పిల్లలు అక్షత (7), కావ్య (5), నాగరాజు (2). వివరాలు.. మల్లమ్మ, భర్త ఉమేశ్‌వ్యవసాయ కూలీలు. కొంతకాలంగా ఉమేశ్‌ నిత్యం తాగుతూ ఉండేవాడు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బంతా మద్యానికి ఖర్చు చేసేవాడు. దీంతో కుటుంబం గడిచేది ఎలా అని మల్లమ్మ ప్రశ్నించడంతో ఘర్షణ పడేవారు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, ఇల్లు గడవకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యేది. సోమవారం రాత్రి కూడా భర్త మద్యం తాగి వచ్చి గొడవ పడ్డాడు. అతడు ఇంటి బయటే నిద్రపోగా, మల్లమ్మ, పిల్లలు ఇంటిలోపల నిద్రించారు. 

ఉదయాన్నే కలకలం  
పొద్దున్నే ఉమేశ్‌ లేచి చూడగా నలుగురూ శవాలుగా కనిపించడంతో గట్టిగా కేకలు వేశాడు. గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చారు. పోలీసులు వచ్చి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కుకనూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.భర్త మద్యానికి బానిస కావడం, కుటుంబాన్ని వేధించడంతో ఆమె ఈఘటనకు పాల్పడిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను కన్న తల్లే దారుణంగా చంపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎంత ఘోరం జరిగిపోయిందని పలువురు గ్రామస్తులు కన్నీరుపెట్టుకొన్నారు.  

ఒక్కొక్కరినీ నీట ముంచి..  
అర్ధరాత్రి సమయంలో నిద్రలేచిన మల్లమ్మ ఇక చావే శరణ్యమనుకుంది. తను చచ్చిపోతే పిల్లలు అనాథలవుతారని ఆలోచించిందేమో. అమాయకంగా నిద్రిస్తున్న పిల్లలు ఆమె నిర్ణయాన్ని మార్చలేకపోయారు. మల్లమ్మ మొదట పెద్ద పాపను నీటి బకెట్లో ముంచి చంపింది. రెండో అమ్మాయిని నీటి ట్యాంక్‌లో ముంచి, కొడుకును నీట్టి తొట్టెలో ముంచి చంపేసింది. తరువాత ఇంట్లో దూలానికి తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు