రికార్డింగ్‌ డాన్సుకు ఆటంకం కలిగిస్తుందని..

6 Dec, 2017 11:29 IST|Sakshi

చిన్నారి హత్యకేసులో తల్లి, ఆమె ప్రియుడు అరెస్టు

వివరాలు వెల్లడించిన సీఐ మురళి

పూటుగా తాగి.. రికార్డు డాన్సులు చేసే.. వారికి అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి అడ్డుగా మారింది. బిడ్డ తరచూ ఏడుస్తూ.. డాన్స్‌కు అంతరాయం కలిగిస్తుండడాన్ని తల్లితో పాటు ఆమె ప్రియుడు జీర్ణించుకోలేక పోయా రు. తాగిన మైకంలో అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. తల్లి సూచనతో ప్రియుడు గొంతునులిమి పైకెత్తగా బిడ్డ ఆటోకమ్మీ తగిలి అక్కడే ప్రాణాలు విడిచింది.

మదనపల్లె క్రైం: గత నెల 25న వెలుగులోకి వచ్చిన చిన్నారి హత్యకేసును ఎట్టకేలకూ ఛేదించినట్లు రూరల్‌ సీఐ మురళీ, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. స్థానిక రూరల్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం చిన్నారి శివాని(2) హత్యకేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఐరాల మండలం మొరంపల్లెకు చెందిన పి.శాంత(22) నిమ్మనపల్లె మండలం మాసిరెడ్డిగారిపల్లెకు చెందిన బోయకొండను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరికి కృష్ణ(3),  శివాని(2) అనే పిల్లలు ఉన్నారు. భర్త ఏడాదిన్నర క్రితం శాంతను వదిలేసి మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో శాంత ఒంటరిగా ఉంటోంది. అప్పటి నుంచి మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన రెడ్డిశేఖర్‌ రికార్డు డాన్స్‌ గ్రూపులో పనిచేస్తోంది. అదే గ్రూపులో రికార్డు డాన్స్‌లు వేసే రామసముద్రం గాజులనగర్‌ కాలనీకి చెందిన ఎస్‌వీ శ్రీనివాసులు(27)తో శాంత సహజీవనం సాగిస్తోంది. ఇద్దరూ కలిసి శ్రీనివాసులు ఆటోలో పల్లెలు తిరిగి రికార్డులు వేసి వచ్చే ఆదాయంతో బతికేవారు.

రోజూ మాదిరిగానే నవంబర్‌ 22న పుంగనూరు మండలం సుగాలిమిట్టకు రికార్డు డాన్సులు వేసేందుకు వెళ్లారు. అక్కడ  పీకల వరకూ మద్యం తాగారు. డాన్సులు వేసే సమయంలో వీరి వెంట ఉన్న చిన్నారి శివాని అనారోగ్యంతో ఏడుస్తోంది. ఇది వారికి అంతరాయంగా మారింది. దీంతో ఆగ్రహించిన తల్లి శాంత.. శివానిని చంపేయాలని ప్రియుడిని ఆదేశించింది. వెంటనే అతను చేతితో గొంతునులిమి పైకి ఎత్తడంతో ఆటో టాప్‌ కమ్మి తగిలి గాయపడి ప్రాణాలు విడిచింది. ఇంటికి తీసుకెళ్తే స్థానికులు గుర్తించి కొడుతారని చెంబకూరు రోడ్డు మార్గంలో రామసముద్రానికి వెళ్తూ దండువారిపల్లె వంకలో శివాని మృతదేహానికి దుప్పటి చుట్టి మోరీకింద నీటి కాలువలో పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు పత్రికల్లో ‘చిన్నారి హత్యకేసు వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మంగళవారం ఉదయం లాభాల గంగమ్మ గుడి వద్ద అనుమానస్పద స్థితిలో ఆటోలో ఉన్న శాంత, ఆమె ప్రియుడు శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని విచారించగా శివాని హత్యకేసు వివరాలు తెలిసినట్లు సీఐ మురళి పేర్కొన్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు