ఎంత పనిచేశావు తల్లి..

15 Jun, 2018 14:12 IST|Sakshi
ఓ వైపు చిన్నారి మృతదేహం, మరో వైపు స్పృహ తప్పిన తల్లి సరిత 

శివసత్తి వద్ద బాగుచేసుకునేందుకు వచ్చి బిడ్డను వాగులో విసిరిన తల్లి

మతిస్థిమితం లేకపోవడమే కారణం..

మంగిమడుగు బంజార, ఎల్లంపేటలో విషాదఛాయలు

బయ్యారం(ఇల్లందు): ఓ దేవుడా ఎంత పనిచేశావయ్యా.. కొడుకుకు ఇద్దరు బిడ్డలే పుట్టారు.. మగబిడ్డ కోసం ఆపరేషన్‌ చేయించలే.. మూడో కాన్పులో మగబిడ్డ పుట్టాడనే తృప్తి లేకుండా చేశావు.. మేమేం చేశాం.. ఈ శిక్ష మాకెందుకు అంటూ తల్లి చేతిలో మృతి చెందిన రెండు నెలల చిన్నారి నానమ్మ లచ్చమ్మ విలపించిన తీరు పలువురి హృదయాలను కలిచివేశాయి.

మతిస్థిమితం లేని తల్లి రెండు నెలల కుమారుడిని వాగులో విసిరేసి.. ఆ చిన్నారి మృతికి కారణమైంది. దీంతో మంగిమడుగు బంజార, ఎల్లంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు బంజారకు చెందిన గంగరబోయిన సురేష్‌కు మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన సరితతో వివాహమైంది. వీరికి హర్షిత, ప్రవళిక సంతానం ఉన్నారు. మరో కాన్పు కోసం ఆపరేషన్‌ చేయించుకోలేదు.

ఈ క్రమంలో రెండు నెలల క్రితం సరిత మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటు ంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సంతోషం కొన్ని రోజులకే ఆవిరైంది. సరిత మతిస్థిమితం లేకుండా వ్యవహరించింది. వైద్యం చేయించినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు.ఏం జరిగింది..?

మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్న సరితను బాగు చేయాలని ఆమె అత్త లచ్చమ్మ, తల్లి పద్మ, ఆడపడుచు పద్మ ఆటోలో సరితతోపాటు ఆమె పిల్లలను తీసుకుని మండలంలోని కట్టుగూడెం లోని దేవుని శివసత్తి (దేవుని పూనకం వచ్చే మహిళ) వద్దకు గురువారం తీసుకొచ్చారు.

శివసత్తి వద్ద పూజలు చేసిన తర్వాత తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో బయ్యారంలోని పాకాలేటి బ్రిడ్జి వద్ద రూపాయి నాణెంతోపాటు నిమ్మకాయను ఏటిలో వేసేందుకు ఆటోను నిలిపారు. సరిత ఆటో దిగి కుమారుడిని వాగులో విసిరేసింది. ఆ తర్వాత ఆమె సైతం దూకేందుకు ప్రయత్నించగా తల్లి, అత్త, ఆడపడుచు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో బయటపడగా అభం శుభం తెలియని చిన్నారి కానరాని లోకాలకు వెళ్లాడు.

ఓ వైపు మనవడు..మరో వైపు కన్నబిడ్డ..

ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన సరిత తల్లి పద్మ నోటివెంట మాటరాని పరిస్థితి. ఓ వైపు మతిస్థిమితం లేని బిడ్డ తన కొడుకును చే తులారా ఏటిలో పడేయడం, ఆ తర్వాత త్రుటిలో ప్రాణాలతో బయటపడిన కన్నబిడ్డ షాక్‌కు గురై స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని ఆమె రోదించింది.
 

మరిన్ని వార్తలు