తల్లే చంపేసింది

2 Nov, 2019 10:22 IST|Sakshi
సయ్యదా ఫర్హత్‌ బేగం

కుమార్తె, కుమారుడిని హత్య చేసిన మహిళ అరెస్టు

జంట హత్య కేసులో తల్లి రిమాండ్‌

నిర్దాక్షిణ్యంగా కుమార్తె, కుమారుడిని హత్య చేసిన వైనం

నిద్ర మాత్రలు, ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇచ్చి దారుణం

చార్మినార్‌/సంతోష్‌నగర్‌: కన్న కూతురు, కుమారుడిని హత్య చేసిన తల్లిని శుక్రవారం కంచన్‌బాగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హఫీజ్‌బాబానగర్‌ ఆలియా గార్డెన్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ రహీం, సయ్యదా ఫర్హత్‌ బేగం దంపతులకు నేహా జబిన్‌ (15), మహ్మద్‌ అబ్దుల్‌ అజీజ్‌ (14)లు సంతానం. గత నెల 26న అబ్దుల్‌ రహీం బయటికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఫర్హత్‌ బేగం తనకు ఆరోగ్యం బాగాలేదని, తనను అక్క ఇంటి వద్ద వదిలేయాలని కోరింది. దీంతో అబ్దుల్‌ రహీం ఆమెను తీసుకెళ్లి అక్క ఇంటి వద్ద వదిలేశాడు. ఇంటికి తిరిగి వస్తూ పిల్లల కోసం టిఫిన్‌ తీసుకు వచ్చిన రహీం వారిని నిద్ర లేపేందుకు ప్రయత్నించగా పిల్లలిద్దరూ లేవకపోవడంతో ఆందోళనకు గురైన అతను వారిని  ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కంచన్‌బాగ్‌ పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కుటుంబసభ్యులతో పాటు స్థానికులను విచారించగా, పర్హత్‌ బేగం మధుమోహంతో బాధపడుతోందని తెలిసింది. ఇందులో భాగంగా గత నెల 26న మెడికల్‌ షాప్‌కు వెళ్లిన ఆమె నిద్రమాత్రలు, ఇన్స్‌లిన్‌ ఇంజెక్షన్లను ఖరీదు చేసింది. అదేరోజు సాయంత్రం మిఠాయిలో కలిపి నిద్రమాత్రలను మింగించింది. వారు మగతలోకి చేరుకున్న అనంతరం ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు ఇచ్చింది. అప్పటికి వారి ప్రాణం పోకపోవడంతో నిర్దాక్షిణ్యంగా గొంతులపై కాలితో తొక్కి హత్య చేసింది. అనంతరం తనకు ఏమీ తెలియనట్లుగా పిల్లలు పడుకున్నారు... నాకు ఆరోగ్యం బాగా లేదు..నన్ను వెంటనే మా అక్క ఇంట్లో వదిలి పెట్టాలని కోరింది. ఆమెను వదిలి ఇంటికి వచ్చిన రహీం పిల్లలను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా విగత జీవుల్లాగా పడి ఉన్న చిన్నారులను కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీ సులు, రహీంతో పాటు తల్లి సయ్యదా ఫర్హత్‌ బేగంను ప్రశ్ని ంచినా సమాధానం రాలేదు. మెడికల్‌ షాప్‌ నుంచి నిద్రమాత్రలు ఖరీదు చేసినట్లు వెల్లడికావడంతో పోలీసులు  ఫర్హత్‌ను విచారించగా నేరం అంగీకరించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తాను మరణిస్తే  పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతోనే ఇద్దరు పిల్లలను హత్య చేసినట్లు  వెల్లడించింది.  నిందితురాలిని  అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు