ఆ తల్లికి బిడ్డ భారమైంది

26 Jan, 2019 12:05 IST|Sakshi

ఊరవతల వదిలేసి వదిలించుకుంది

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘చెట్టుకు కాయ భారమా..కని పెంచే తల్లికి బిడ్డ భారమా’ పాత తెలుగు చిత్రంలోని ఈ పాటలోని అర్థానికి విరుద్ధంగా వ్యవహరించింది ఓ తల్లి. అంతగా మతిస్థిమితం లేని 38 ఏళ్ల కుమార్తె ఆమెకు భారమైంది. దీంతో వేరే ఊరిలో వదిలిపెట్టి వదిలించుకుంది. వివరాలు..తూత్తుకూడి జిల్లా పుదుకోట్టై సమీపం పొట్టలూరని విలక్కల్‌ గ్రామం లో ఓ మహిళ తీవ్రగాయాలతో స్పృహతప్పి పడి ఉండగా ఈనెల 17న పోలీసులు కనుగొని ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగురోజుల చికిత్స అనంతరం ఆమెకు స్పృహరాగా తిరునెల్వేలి జిల్లా తెన్‌కాశీ కుత్తుకల్‌వలసైకి చెందిన ఇందిర (38) అని తెలిసింది. దీంతో పోలీసులు కుత్తుకల్‌వలసైకి వెళ్లి విచారించగా ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూశాయి.

బాధితురాలు ఇందిరకు ఆమె మేనమామతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఎంతకూ సంతానం కలగకపోవడంతో ఇందిర మానసిక రోగిగా మారింది. ఈ కారణంగా దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొనగా భర్త వదిలేసి వెళ్లడంతో ఆమె పుట్టింటికి చేరి తల్లి లీలతో ఉండేది. కుమార్తెను ఎందరో వైద్యుల వద్దకు తీసుకెళ్లినా ఆమె మానసిక స్థితి కుదుటపడలేదు. పైగా రోజురోజుకూ ఇందిర పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో మరో ప్రయత్నంగా తెన్‌కాశిలోని ప్రభు త్వ ఆస్పత్రిలో చేర్పించింది. ఆస్పత్రి పక్కపై నుంచి కిందపడడంతో గాయాలయ్యాయి. ఆస్పత్రిలో ఇక వైద్యం చేయించలేని స్థితిలో కుమార్తె ఇందిరను తల్లి లీల మరలా తన ఇంటికి తీసుకెళ్లింది. శాశ్వతంగా వదిలించుకోవాలని నిశ్చయించుకుని స్పృహలోలేని స్థితిలో ఉన్న ఇందిరను ఈనెల 18న అద్దెకారులో ఎక్కించుకుని తూత్తుకూడి సమీపంలోని పొట్టలూరని విలక్కల్‌లో విడిచిపెట్టింది. ఈనెల 23న స్పృహరాగా తల్లే తనని విడిచిపెట్టి వెళ్లిన విషయాన్ని బాధితురాలు పోలీసులకు వివరించింది.

మరిన్ని వార్తలు