మేమేం పాపం చేశాం తల్లీ..!

25 Apr, 2019 09:21 IST|Sakshi
నరసింహులు, పద్మావతి, పిల్లలు మనోజ్, సంజీవ్‌ (ఫైల్‌)

ఇద్దరు కుమారులపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టిన తల్లి

ఆపై తాను ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతూ చిన్నారుల మృతి

కర్నూలు జిల్లాలో ఘటన  

ఎమ్మిగనూరు రూరల్‌: పేద కుటుంబంలో వలస చిచ్చు పెట్టింది. ఉన్న ఊర్లో పనులు లేక..బతికే దారిలేక గ్రామం విడిచి వెళ్లే విషయంలో దంపతుల మధ్య గొడవ ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదపురం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కురవ నరసింహులు, కురవ పద్మావతి దంపతులు. వీరికి మనోజ్‌ (4), సంజీవ్‌ (2) సంతానం. భార్యభర్తలు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనికి వేరే ఊరికి వలస వెళ్లే విషయంలో కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై మంగళవారం  వీరు గొడవపడ్డారు. ‘‘చిన్న పిల్లలు ఉన్నారు.. ఎండ ఎక్కువగా ఉంది..నేనొక్కడినే వలస వెళ్లి వస్తాను..మీరు ఇంటి దగ్గరే ఉండండి’’అని భార్యకు నరసింహులు చెప్పగా తాను కూడా ఇద్దరు పిల్లలతో కలిసి వస్తానని భర్తతో పద్మావతి చెప్పింది.

ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి భార్యపై నరసింహులు చేయిచేసుకున్నాడు. మనస్తాపానికి గురైన పద్మావతి బుధవారం ఉదయం భర్త నరసింహులు బహిర్భూమికి వెళ్లగా క్షణికావేశంలో నిద్రిస్తున్న చిన్నారులపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. ఆపై తాను కూడా నిప్పంటించుకుంది. చిన్నారులను స్థానికులు 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పద్మావతికి స్వల్ప గాయాలయ్యాయి. పిల్లలు కట్టెల పొయ్యిలో పడ్డారని పద్మావతి పొంతన లేని మాటలు చెప్పడం గమనార్హం. చిన్నారుల శరీర భాగాలు ఎక్కువ శాతం కాలిపోవటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు కర్నూలుకు తరలించారు. మార్గమధ్యలో మనోజ్, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సంజీవ్‌ మృతి చెందారు.చిన్నారులను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు తీసుకురాగా..వైద్యులు రాకపోవటంతో కాంపౌండర్‌ వైద్యం చేశాడు. చిన్నారుల కాలిన గాయాలకు కూడా బర్నాల్‌ మందును కుటుంబసభ్యులతో తెప్పించారు. అరగంట పాటు చిన్నారుల శరీరానికి చల్లదనం ఇచ్చే వైద్యం అందించకుండా కేవలం తూతూమంత్రంగా ప్రథమ చికిత్సలు చేయించడం విమర్శలకు తావిచ్చింది. వైద్యులు ఏడు గంటలకు ఆస్పత్రికి వచ్చి చిన్నారులకు ప్రథమ చికిత్స చేశారు.

మరిన్ని వార్తలు