కూతురిని సజీవ దహనం చేసిన తల్లి

20 Nov, 2019 10:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. దళితుడిని ప్రేమించిందనే కోపంతో కన్నతల్లే కూతురిని కడతేర్చింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసి.. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... వాజ్మంగళం అనే గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరి, కన్నన్‌ దంపతులకు జనని(17) అనే కూతురు ఉంది. కన్నన్‌ కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. ఉమా రోజూవారీ కూలీగా పనిచేస్తూ భర్తకు అండగా ఉంటోంది. ఈ క్రమంలో మైనర్ అయిన జనని.. వారి గ్రామానికే చెందిన ఓ దళిత యువకుడిని ప్రేమించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమె.. వచ్చే నెలలో మేజర్‌ కానుండటంతో అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. 

ఈ క్రమంలో మంగళవారం ప్రియుడితో కలిసి పారిపోయేందుకు జనని సిద్ధపడింది. అయితే ఈ విషయం జనని తల్లి తెలియడంతో కూతురితో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన ఉమ.. కూతురిపై కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేసింది. అనంతరం తాను కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జనని.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఇక ఉమ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూతురి హత్యలో తండ్రి కన్నన్‌కు కూడా భాగం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు