రూ లక్ష కోసం కుమార్తెను అమ్మిన తల్లి

15 Sep, 2019 16:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : రూ లక్ష కోసం కన్న కుమార్తె(15)ను వేశ్యా గృహానికి తల్లి విక్రయించగా బాధిత బాలికను ఢిల్లీ మహిళా కమిషన్‌ కాపాడిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని షెల్టర్‌ హోంకు తరలించారు. సోదరి ఇంటికి తీసుకువెళతానని చెప్పి కుమార్తె నిషా (పేరు మార్చాం)ను ఈనెల 8న తల్లి నిజాముద్దీన్‌లో ఓ హోటల్‌కు తీసుకువెళ్లిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అబ్ధుల్‌ అనే వ్యక్తితో ఒప్పందం కుదిరిన అనంతరం నిషా తల్లి బాధిత బాలికను అతడితో వెళ్లాలని, షాహిద్‌ అనే వ్యక్తి ఇంటికి తీసుకువెళతాడని చెప్పింది. అయితే బాలికను ఢిల్లీలోని భవానా గ్రామం ఐశ్వర్‌ కాలనీలోని తన ఇంటికి షాహిద్‌ తీసుకువెళ్లాడు. షాహిద్‌ ఇంటిలో ఉన్న ఇతర బాలికలు బాధితురాలిని అసలు విషయం చెప్పారు. రూ లక్షకు నిషాను ఆమె తల్లి అమ్మేసిందని ఆ సొమ్ము వారికి తిరిగివచ్చేవరకూ ఈ నరకకూపంలో ఉండాలని వెల్లడించారు. ఒక్కరోజులోనే అక్కడి నుంచి తప్పించుకున్న నిషా స్ధానికుల సహకారంతో ఢిల్లీ మహిళా కమిషన్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ఆశ్రయించారు. మహిళా కమిషన్‌ బృందం హుటాహుటిన అక్కడికి చేరుకుని బాలికను స్ధానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ కేసులో నిషా తల్లి సహా నిందితులందరినీ తక్షణమే అరెస్ట్‌ చేయాలని, సవతి తండ్రి పాత్రపైనా దర్యాప్తు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ పోలీసులను కోరారు.

మరిన్ని వార్తలు