భగ్గుమంటున్న ఎండలో బుగ్గిపాలవుతున్న వాహనాలు

4 Mar, 2019 09:14 IST|Sakshi
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (ఫైల్‌) , షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయిన హైచర్‌ వాహనం (ఫైల్‌)

భగ్గుమంటున్నఎండలతో వాహనాలకు సెగ 

ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ లోపంతో ప్రమాదాలు 

క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించడమే ఉత్తమం 

15 రోజుల ముందే తీవ్రమైన భానుడి భగభగలు  

సాక్షి, నాగర్‌కర్నూల్‌ క్రైం: సాధారణంగా మార్చి నెలలో ప్రారంభం కావాల్సిన ఎండాకాలం ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య నుంచే తీవ్రరూపం దాల్చాయి. వేసవిలో భానుడి భగభగలకు వాహనాలు బుగ్గి పాలవుతున్నాయి. వాహన యజమానుల అవగాహన లేమితో కొన్ని వాహనాలు, స్వయం కృతాపరాదంతో మరికొన్ని వాహనాలు వేసవికాలంలో మంటల్లో చిక్కుకుని కాలిపోయి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా ఉండకపోతే ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వాహన యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట వేసవి కాలంలో వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో వాహనదారులు ముందుజాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను కొంతవరకైనా అరికట్టవచ్చు. 

ఈ ఘటనలే నిదర్శనం 

  • ఈ నెల 23న బిజినేపల్లి మండలం వెంకటాద్రి రిజర్వాయర్‌ పనుల వద్ద హైచర్‌ వెహికల్‌ (డీసీఎం)లో బ్యాట్రీ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. 
  • గతేడాది నవంబర్‌ 22న బిజినేపల్లి మండలం వెంకటాద్రి రిజర్వాయర్‌ పనుల వద్ద మెకానికల్‌ హీట్‌తో టిప్పర్‌లో మంటలు చెలరేగి టిప్పర్‌ ముందుభాగంతోపాటు, ఇంజన్‌ కాలిపోయింది. 
  • ఇవే ప్రధాన కారణాలు 
  • వాహనదారులు నిత్యం వాహనాలు నడపడం మాత్రమే చేస్తుంటారు. వాటి నిర్వహణను సరిగా పట్టించుకోరు. తరచూ వాహనాలను మెకానిక్‌ వద్దకు తీసుకువెళ్లి సర్వీసింగ్‌ చేయించి వాహనాల్లోని మెకానికల్‌ సమస్యలను పరిష్కరించుకుంటే వాహనాలలో జరిగే అగ్నిప్రమాదాలు అరికట్టవచ్చు. 
  • వాహనాల్లో తరచూ అగ్నిప్రమాదాలకు కారణం వాహనాలకు కంపెనీ నుంచి వచ్చే వైరింగ్‌ కాకుండా ఇతర ఎక్స్‌ట్రా వైరింగ్‌ చేయిస్తుండటంతో వైర్లకు వేసే అతుకుల వల్ల, వాటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. 
  • వేసవికాలంలో 4 వీలర్‌ వాహనాల్లో చాలా దూరం ప్రయాణం చేసే వారు వాహనంలో ఏసీని వాడటం వల్ల కూడా షార్ట్‌సర్క్యూట్‌ జరిగే అవకాశం ఉంది. 
  • వేసవిలో వాహనాలను ఆపకుండా నడపడం వ ల్ల ఇంజన్‌ హీట్‌ అయి ప్రమాదాలు జరుగుతాయి. 
  • వాహనాల్లో మైలేజీ కోసం గ్యాస్‌ కిట్లను వాడు తున్నారు. అయితే ఈ గ్యాస్‌ కిట్లు అప్రూవల్‌ కిట్లు కాకుండా నాసిరకానివి వాడటం వల్ల వేసవి ఎండలకు వాహనాల్లో అగ్నిప్రమాదాలు జరుగుతాయి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  • వాహనాలను నడిపేటప్పుడు టెంపరేచర్‌ మీటర్‌ చూసుకుంటూ వాహనాలను నడపాలి. టెంపరేచర్‌ మీటర్‌లో స్పీడ్‌ ఎక్కువగా చూయిస్తే వెంటనే వాహనాన్ని నడపడం ఆపివేయాలి. 
  • ప్రతి వాహనంలో చిన్న ఫైర్‌ఎక్జ్సింగ్‌ విషర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదవశాత్తు వాహనంలో మంటలు చెలరేగితే ఫైర్‌ ఎక్జ్సింగ్‌ విషర్‌ ద్వారా మంటలను అదుపు చేయవచ్చు. 
  • వాహనాల్లో ఇంజన్‌ వేడెక్కడం ఆ తర్వాత ఓవర్‌ హీట్‌ కావడం వల్ల మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంజన్‌కు కూలింగ్‌ చాలా కీలకంగా ఉండటంతో వాహనాల్లో తరచూ కూలింగ్‌ చెక్‌ చేసుకోవాలి. 
  • వాహనాల్లో వైరింగ్‌ వల్ల మంటలు వచ్చే అవకాశం ఉన్నందున కంపెనీ వారు అమర్చిన వైరింగ్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఉత్తమం. 
  • వీల్‌బెరింగ్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌ చేయించుకోవాలి. వాటి వల్ల కూడా ఎక్కువగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. 
  • వాహనాలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. అగ్నిప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్‌ ద్వారా జరిగే నష్టాన్ని పూడ్చుకోవచ్చు. 
  • వాహనం కాలిపోతుంటే అందులోని వస్తులను తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ వస్తువులను తీసుకునే ప్రయత్నం చేస్తే శరీరానికి మంటలు అంటుకునే ఆస్కారం ఉంది. 
  • వేసవి కాలంలో లాంగ్‌ డ్రైవింగ్‌లకు సాధ్యమైనంత వరకు స్వస్తి చెప్పాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాంగ్‌ డ్రైవింగ్‌లకు వెళ్లడం ఉత్తమం. అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రయాణాలు కొనసాగించాలి. 
  • వాహనాల సీట్లలో, ఇతర విడి భాగాలు ప్లాస్టిక్‌ ఉండటంతో అగ్నిప్రమాదాలు జరిగితే వాటి నుంచి విషవాయులు వెలువడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వాహనానికి దూరంగా వెళ్లాలి.

నిర్వహణ సరిగా ఉండాలి.. 
వాహనదారులు తమ వాహనాలను నిత్యం సర్వీసింగ్‌ చేయించుకుని వాటి నిర్వహణను సరిగా చేయాలి. వాహనాలలో కంపెనీ వారు ఇచ్చిన పరికరాలు, వైరింగ్‌ల స్థానంలో ఇతర వాటిని అమర్చడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కంపెనీ నుంచి వాహనాలను తీసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌ పేరుతో చాలా మార్పులు చేయిస్తున్నారు. సాధ్యమైనంత వరకు కంపెనీ అమర్చిన వైరింగ్‌ దగ్గరికి వెళ్లకపోవడమే మంచిది. వాహనదారులు వాహనాలలో ఏర్పాటు చేసుకునే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లకు తప్పనిసరిగ్గా అనుమతి పొందాలి.
 
– ఎర్రిస్వామి, జిల్లా రవాణా శాఖాధికారి, నాగర్‌కర్నూల్‌   

మరిన్ని వార్తలు