విద్యార్థిని పట్ల అమానవీయ ప్రవర్తన..టీచర్‌ అరెస్టు

16 May, 2019 14:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : విద్యార్థిని పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో స్థానిక కోర్టు 14 రోజుల పాటు అతడికి రిమాండ్‌ విధించింది. బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల మేరకు... శివ్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే వ్యక్తి కూతురు తాండ్లా పట్టణంలోని నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా గతేడాది జనవరి 1 నుంచి 10 వరకు స్కూలుకు వెళ్లలేకపోయింది. ఈ క్రమంలో 11వ తేదీన స్కూలుకు వెళ్లగా హోం వర్క్‌ చేయలేదంటూ మనోజ్‌ వర్మ అనే ఉపాధ్యాయుడు మందలించాడు. అనంతరం బాధితురాలిని 168 సార్లు చెంపదెబ్బలు కొట్టాల్సిందిగా తోటి విద్యార్థులను ఆదేశించాడు. ఆరు రోజుల్లో రోజుకు రెండుసార్లు ఇలా ఆమెను శిక్షించాలంటూ 14 మంది బాలికలకు చెప్పాడు.

ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశాడు. దీంతో కమిటీ వేసి మనోజ్‌ వర్మను దోషిగా తేల్చి.. ఇటీవల అతడిని సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో తనకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించగా.. కోర్టు అతడి అభ్యర్థనను తిరస్కరించింది. కాగా అవమానం జరిగిన నాటి నుంచి తన కూతురు స్కూలుకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని, వేదనతో కుంగిపోతోందని బాధితురాలి తండ్రి శివ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు