వేటగాళ్ల ఉచ్చుకు ఎంపీటీసీ బలి

28 Jan, 2020 08:21 IST|Sakshi
ఎంపీటీసీ ఆసిఫ్‌ మృతదేహం

తీగలు అమర్చిన ఇద్దరిపై కేసు నమోదు

అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే..

మందమర్రి రూరల్‌(చెన్నూర్‌): మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మామిడిగట్టు సమీపంలో అటవీ ప్రాంతానికి షికారుకు వెళ్లి విద్యుత్‌ తీగలకు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. షికారుకు వెళ్లిన వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి సండ్రోనిపల్లికి చెందిన బైర్నేని ప్రశాంత్, సారంగపల్లి నివాసి, చిర్రకుంట ఎంపీటీసీ ఎండీ ఆసిఫ్, తుర్కపల్లికి చెందిన ఎండీ అఫ్రోజ్, మామిడిగట్టుకు చెందిన సయ్యద్‌ షరీఫ్‌ షికారుకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తున్న క్రమంలో అడవిజంతువుల కోసం అమర్చిన జే వైర్‌ ముందుగా వస్తున్న ఆసిఫ్‌ కాలుకు తగలడంతో ఒక్కసారిగా పైకిఎగిరి కిందపడి మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇద్దరిపై కేసు నమోదు
అడవి జంతువుల షికారుకోసం విద్యుత్‌ తీగలు అమర్చి ఆసిఫ్‌ మృతికి కారణమైన మామిడిగట్టుకు చెందిన గజ్జె దుర్గయ్య, నాంపెల్లి రాజంలపై సయ్యద్‌ షరీఫ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామకృష్ణాపూర్‌ ఎస్సై రవిప్రసాద్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నిద్రమత్తులో అధికారులు 
అటవీ ప్రాంతంలో అడవిజంతువుల షికారు జరుగుతున్నా అధికారులు నిద్రమత్తు వీడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. షికారుకు వెళ్లామని బహిరంగంగానే చెబుతున్నా వారిని కనీసం అదుపులోకి తీసుకోలేదంటే వారి విధి నిర్వహణ అర్ధమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. అటవీశాఖ అధికారులు అడవిని, వన్యప్రాణులను రక్షించాలని ఎన్నో ఆంక్షలు విధిస్తూ కఠిన చట్టాలు చేసినా ఇలాంటి వ్యవహారం జరుగుతుందంటే అధికారుల చేయి లేనిదే జరగడం లేదని, అధికారులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే ఎంపీటీసీ మృతి చెందేవాడు కాదని మండల ప్రజలు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు