నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ ఆత్మహత్య

4 Oct, 2019 01:56 IST|Sakshi

నిజామాబాద్‌ అర్బన్‌/మోపాల్‌ : నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ జ్వాలా గిరిరావు (50) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లగొం డ జిల్లా రామగిరి మండలానికి చెందిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన బదిలీల్లో భాగంగా గతేడాది అక్టోబర్‌ 11న నిజామాబాద్‌ రూరల్‌ మండలానికి వచ్చారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లో పనిచేసే వారు. జ్వాలా గిరిరావు కుటుంబం హైదరాబాద్‌లో ఉంటుండగా, ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆయన భార్య శ్రీదేవి గురువారం ఉదయం ఫోన్‌ చేయగా, ఎంతకీ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో ఆమె డ్రైవర్‌ ప్రవీణ్, వీఆర్వోకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో వారిద్దరూ గిరిరావు అద్దెకు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలు కొట్టిలోనికి వెళ్లి చూడగా, బెడ్‌రూంలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, జేసీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తహసీల్దార్‌ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆస్పత్రి నుంచి కలెక్టరేట్‌ వరకు మృతదేహంతో ర్యాలీ నిర్వహించారు. 

తహసీల్దారు ఆత్మహత్య బాధాకరం
సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా రూరల్‌ తహసీల్దారు జ్వాలా గిరిరావు ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లచ్చిరెడ్డి, రమేష్‌ రాథోడ్‌ అన్నారు.  గిరిరావు కుటుంబానికి డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రగాఢ సానుభూతిని తెలుపుతోందన్నారు. రెవెన్యూ శాఖలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు