విషమంగా సురేశ్‌ ఆరోగ్యం..

6 Nov, 2019 10:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తునకై రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వనస్థలిపురం ఏసీపీ జయరాంను విచారణ అధికారిగా నియమించారు. అదే విధంగా విజయారెడ్డిని కాపాడబోయి చికిత్స పొందుతూ ఆమె డ్రైవర్‌ గురునాథం మృతి చెందిన నేపథ్యంలో ఈ కేసులోని సెక్షన్లలో మార్పులు చేశారు. గురునాథం మృతి తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. అదే విధంగా ఘటనా స్థలంలో నిందితుడు సురేశ్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు... తహశీల్దార్ హత్య తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

కాగా విజయారెడ్డిని సజీవ దహనం చేసిన రైతు సురేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడు ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా ఆస్పత్రిలోని బర్నింగ్‌ వార్డులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సురేశ్‌ ఛాతీ, పొట్ట, ముఖం, కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలు శరీరంలోని నీరు మొత్తం పోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం న్యూరో బర్న్‌ షాక్‌లో ఉన్న సురేశ్‌ మరో 24 గంటలు దాటితే స్కిన్‌ బర్న్‌ సెప్టిక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. ప్రస్తుతానికి అతడికి ఫ్లూయిడ్స్‌ అందిస్తూ చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యులు 72 గంటలు గడిస్తే గానీ అతడి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం లేదన్నారు.

హత్యకు కారణం అదేనా...?
మరోవైపు ఇప్పటికే  నిందితుడి నుంచి మెజిస్ట్రేట్  డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లనున్నారు. అదే విధంగా సురేశ్‌ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హయత్‌నగర్ , అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్నేహితులతో సురేశ్‌ మాట్లాడినట్లు గుర్తించామన్నారు. అలాగే హత్యకు ముందు కొద్ది నిమిషాల క్రితం సురేశ్‌ తన పెదనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. అంతేకాకుండా వేరే వ్యక్తులతో మాట్లాడిన కాల్స్‌ను సురేశ్‌ రికార్డ్ చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా సురేష్ కుటుంబానికి చెందిన 9 ఎకరాల భూమి వివాదమే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికి సురేశ్‌ తండ్రి కృష్ణ, పెద్దనాన్న దుర్గయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా గతంలో కూడా ఈ భూ వివాదంపై గ్రామ సభల్లో తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో సురేశ్‌ గొడవలకు దిగినట్లు సమాచారం. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా