బస్తీమే దొంగల్‌!

21 Oct, 2018 14:52 IST|Sakshi
ఒంగోలులో పంది రాజ్‌కుమార్‌ నివాసంలో వేలిముద్రలు సేకరిస్తున్న వేలిముద్రల నిపుణులు  

ఒంగోలు : పోలీసులకు దొంగలు సవాల్‌ విసురుతున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ ఖాకీలకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. నగరంలో ఒకే కాలనీలో ఒకే రోజు నాలుగు గృహాల్లో చోరీకి పాల్పడ్డారు. వారం క్రితం చోరీ జరిగిన గృహం వెనుక ఇంట్లోనే మళ్లీ చోరీకి పాల్పడ్డారు. స్థానిక ఏబీఎం కాలేజీ ఎదురుగా ఉన్న కబాడీపాలెంలో ఈ ఘటనలు శనివారం ఉదయం వెలుగు చూశాయి. ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఏబీఎం జూనియర్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఒంగోలు క్యాంపస్‌లో ఎకనామిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలమణి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లోని సుమారు 30 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1.95 లక్షల నగదు చోరీకి గురైన సంగతి విదితమే. కచ్చితంగా ఈ ఇంటి వెనుక వైపు రోజ్‌కుమార్, అతని భార్య నివాసం ఉంటుంటారు.

ఇద్దరూ వెటర్నరీ డిపార్టుమెంట్‌ ఉద్యోగులే. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో ఇంటికి తాళం వేసి వైజాగ్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు ప్రవేశించి ముందుగా సింగిల్‌ హ్యాండిల్‌ డోర్‌ను బలవంతంగా తెరిచారు. ఇంట్లో దొరికిన డ్రైఫ్రూట్స్‌ను ఖాళీ చేశారు. అనంతరం ఇంట్లో దొరికిన వస్తువులతో ఉడాయించారు. బంగారు, వెండి వస్తువులు పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నా ఎంతమేర చోరీ అయింది ఇంటి యజమాని వస్తేగాని వెల్లడయ్యే అవకాశం లేదు. ఈ ఇంటికి పక్కనే ఉన్న మరో ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి ఎంతవెతికినా వారికి ఎటువంటి విలువైన వస్తువులు లభించలేదు. ఎదురుగా ఉన్న ఇంటిని టార్గెట్‌ చేశారు. ఈ ఇంటి యజమాని పంది రాజశేఖర్‌ నాలుగు ఇళ్ల అవతల సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. గృహ ప్రవేశం కూడా జరిగింది.

సిద్ధాతం రీత్యా మూడో రోజు వరకు దంపతులు నూతన ఇంట్లో నిద్రచేయాలనే ఆలోచనతో నివాసం ఉండే ఇంటికి తాళం వేసి వారు నూతన గృహంలో నిద్రించారు. ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడం, ఇంటి బయట ఉండాల్సిన బైక్‌ కనబడకపోవడంతో విషయం అర్థమైంది. లోపల బీరువాలోని వస్తువులన్నీ చెల్లాచెదరుగా పడేసి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన తర్వాత పరిశీలిస్తే 50 సవర్ల బంగారు ఆభరణాలు, మూడు జతల వెండి పట్టీలు, రూ.200 నగదు, ఇంటి ముందు పార్కు చేసిన మోటారు బైకు చోరీకి గురైనట్లు గుర్తించారు. పూర్వీకుల నుంచి వస్తున్న బంగారు ఆభరణాలు ఇటీవలే తాకట్టు నుంచి విడిపించుకొచ్చారు. ఈ ఇంటికి ఇంకొంచెం దూరంలో ఉన్న వీధిలోని తేజోకాంత్‌ అనే వ్యక్తి ఇంట్లో కూడా చోరీ జరిగింది. వీరు కూడా ఇంట్లో లేని సమయంలో దొంగలు నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, రెండు వెండి గాజులు, రూ.5 వేలు నగదుతో ఉడాయించారు. మొత్తంగా నాలుగు ఇళ్లల్లోకి దొంగలు ప్రవేశించారు. రెండు ఇళ్లల్లో చోరీ అయిన సొత్తు రూ.14.50 లక్షలు వరకు ఉంది. ఇక మరో ఇంట్లో ఎంత సొత్తు చోరీ అయిందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

దొంగను పట్టించనున్న సీసీ కెమెరా
నాలుగు ఇళ్ల మధ్య ఓ ఇంటి యజమాని మోటారు బైకు ఇటీవల చోరీకి గురైంది. ఆయన ముందస్తు జాగ్రత్తగా ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకున్నారు. దాని పుటేజీని పరిశీలించగా నిందితుడి ఆచూకీ లభ్యమైంది. నిందితుడు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. దొంగ పాత నేరస్తుడేనని అంచనా వేస్తున్నారు. వేలిముద్రల నిపుణులు సేకరించిన వివరాల ఆధారంగా సంబంధిత నేరస్తుడి వేలిముద్రలతో సరిపోల్చాలని నిర్ణయించారు. రెండు వేలిముద్రలు సరిపోతే నిందితుడు అతనే అనేది స్పష్టం అవుతుంది. నాలుగు ఇళ్లల్లో జరిగిన చోరీ కావడం, అందులోనూ ఓ ఇంట్లో ఎక్కువ సేపు దొంగ తిష్టవేసి డ్రైఫ్రూట్స్‌ నింపాదిగా తిన్నట్లు ఆనవాళ్లు కూడా ఉండటంతో చోరీకి పాల్పడిన వ్యక్తి ఒకరా లేక ముఠానా అన్నదానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు