డూప్లికేట్‌ సిమ్‌తో రూ. 3.3 కోట్లు దోచేశాడు!

15 Jul, 2019 15:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త సైబర్‌ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆయన సిమ్‌, ఆధార్‌ నంబర్లను సేకరించిన కేటుగాళ్లు వాటిని డూప్లికేట్‌ చేసి దాదాపు మూడున్నర కోట్లు కొట్టేశారు. సదరు వ్యాపారవేత్త ఫిర్యాదుతో రంగంలోకి ముంబై సైబర్‌ సెల్‌ పోలీసులు గోవండికి చెందిన అమానతుల్లా షేక్‌ను నిందితుడిగా తేల్చారు.

పక్కా ప్లాన్‌తో..
కొన్ని రోజులుగా వ్యాపారవేత్త లావాదేవీలపై దృష్టి సారించిన అమానుతుల్లా అతడి ఫోన్‌, ఆధార్‌ నంబర్‌ సంపాదించాడు. అనంతరం తనే ఆ వ్యాపారవేత్తగా నటించి తాను ఫోన్‌ పోగొట్టుకున్నానని కాబట్టి అదే నంబరుతో మరో సిమ్‌ ఇవ్వాలని టెలికామ్‌ ప్రొవైడర్‌ను కోరాడు. ఈ క్రమంలో వ్యాపారవేత్త బ్యాంక్‌ అకౌంట్‌ నంబరుకు ఫోన్‌ నంబరు లింక్‌ అయి ఉండటంతో జూలై 7 నుంచి భారీ మొత్తాన్ని డ్రా చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త సైబర్‌ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. కాగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేయడం అమానుతుల్లా ఒక్కడి వల్ల అయ్యే పని కాదని... అతడితో పాటు టెలికామ్‌ సర్వీసు సిబ్బంది, బ్యాంకు సిబ్బందికి కూడా కుమ్మక్కయ్యారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దోచేసిన డబ్బుతొ అమానుతుల్లా బంగారం, ఇతర విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేశాడని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు