చిన్నారిని ఏడో అంతస్తు నుంచి కింద పడేసిన కిరాతకుడు

10 Sep, 2019 13:08 IST|Sakshi

ముంబై: నీకు ఎవరో చేతబడి చేశారు. అందుకే నీ జీవితంలో ఇన్ని కష్టాలు. ఈ కడగళ్లు తీరాలంటే.. కవలల్ని బలి ఇవ్వు. అప్పుడు జీవితం నువ్వు కోరినట్లు మారుతుంది’ ఈ వ్యాఖ్యలు పదే పదే చుగాని చెవుల్లో మారుమోగుతున్నాయి. అవును అతీంద్రీయ శక్తులు చెప్పింది నిజమే. నాకు చేతబడి చేశారు. అందుకే ఈ కష్టాలు. ఇవి తీరాలంటే కవలల్ని బలి ఇవ్వాలి. నా చుట్టుపక్కల, తెలిసిన వారిలో ఎవరికి కవల పిల్లలు ఉన్నారు. ఆ గుర్తుచ్చొంది. నా స్నేహితుడి ప్రేమ్‌కు ఇద్దరు కవల పిల్లలే కదా. వారిని చంపేస్తే.. నా సమస్యలు తీరిపోతాయి.. ఇలా రాసుకొచ్చాడు అనిల్‌ చుగాని అనే వ్యక్తి తన డైరీలో. నాలుగు రోజుల క్రితం ముంబై కొలబా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిని ఏడో అంతస్తు నుంచి కిందకు విసిరేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన అనిల్‌ చుగాని స్వయంగా తానే పోలీసులకు లొంగిపోయాడు. విచారణలో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాడు.

ఆ వివరాలు.. ముంబైకి చెందిన చుగాని మొరాకోలో ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ప్రతి ఏడాది రెండు నెలల పాటు ఇండియాకు వచ్చే వాడు. కానీ ఈ సారి వచ్చి.. ఇక్కడే ఉండి పోయాడు. అయితే భారత్‌కు వచ్చే ముందు చుగానితో పాటు పని చేసే ఓ స్నేహితురాలు ఒకామె అతడికి చేతబడి చేశారని.. అందుకే అతన్ని సమస్యలు చుట్టుముట్టాయని తెలిపింది. కవలల్ని బలి ఇస్తే ఈ సమస్యలు తీరతాయని కూడా చెప్పింది. ఆమె మాటలు చుగాని మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఇండియా వచ్చిన తర్వాత కూడా దీని గురించే ఆలోచించడం ప్రారంభించాడు చుగాని. ఈ క్రమంలో అతీంద్రీయ శక్తులు కూడా తనతో ఇదే విషయాన్ని చెప్పాయని డైరీలో రాసుకున్నాడు చుగాని. ఇక అప్పటి నుంచి కవలల కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి తన స్నేహితుడు ప్రేమ్‌ కవల పిల్లలు శ్రేయ, సన్యలు కనిపించారు. దాంతో వీరిద్దరిని చంపాలని భావించాడు చుగాని. ఈ ఏడాది మే నెల నుంచి వారిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలో గత శనివారం రాత్రి చుగాని, ప్రేమ్‌ కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. కాసేపు అతని పిల్లలతో ఆడుకుంటానని కోరాడు. దాంతో ప్రేమ్‌ తల్లి పిల్లలను తీసుకుని చుగాని ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన చుగాని తన ఇంటికి వచ్చిన పిల్లలకు భోజనం పెట్టి చేతులు శుభ్రం చేసే నెపంతో ఓ చిన్నారిని తీసుకెళ్లి తన ఇంటి నుంచి అనగా ఏడో అంతస్తు కిటికి నుంచి కిందకు పడేశాడు. మరో చిన్నారిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. కానీ చిన్నారుల నానమ్మ ఆ పాపతో పాటే ఉండటంతో కుదరలేదు. చిన్నారి పై నుంచి కిందపడటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుగానిని అరెస్ట్‌ చేశారు. పోలీసులను చూసిన చుగాని ఏ మాత్రం కంగారు పడకుండా చిన్నారిని తానే చంపానని ఒప్పుకోవడమే కాక ఇలా చేసినందుకు తనను అరెస్ట్‌ చేస్తారని తెలుసని పేర్కొన్నాడు. జైలుకు వెళ్లినప్పటికి తన సమస్యలు పరిష్కారం అవుతాయని చుగాని పోలీసులకు తెలిపాడు.

మరిన్ని వార్తలు