లవ్‌ జిహాద్‌ : మతం మారాలంటూ మోడల్‌కు టార్చర్‌

18 Nov, 2017 10:53 IST|Sakshi

ముంబై : లవ్‌ జిహాద్‌కు చెందిన మరో షాకింగ్‌ కేసు ముంబైలో వెలుగులోకి వచ్చింది. మతం పేరుతో తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా హింసిస్తున్నారంటూ మాజీ మోడల్‌ ఫిర్యాదు చేసింది. హిందూ మత ఆచారాలను పాటించే కుటుంబ నేపథ్యానికి చెందిన రష్మి షాబెస్కర్‌, 13 ఏళ్ల క్రితం ముస్లిం మతానికి చెందిన అబ్బాయిని పెళ్లాడింది. పెళ్లి సమయంలో ఆమెతో పాటు తన మత ఆచారాలకు ఆయన అంగీకారం తెలిపాడు. కానీ గత కొన్నేళ్లుగా రష్మిని ఇస్లాంలోకి మారాలంటూ వేధించడం ప్రాంరభించాడు. మతం మారడం ఇష్టలేని రష్మి, ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో, ఆమె భర్త మరో 28 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ తన సోదరుడి గర్ల్‌ఫ్రెండే కావడం గమనార్హం.

గెస్ట్‌గా వారి ఇంట్లో ఉంటుండటంతో పాటు, ఆమె ఇస్లాంలోకి మారడానికి ఇష్టపడటంతో, తన భర్త ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్టు రష్మి చెప్పింది. తర్వాత ఆమెను వివాహం కూడా చేసుకున్నట్టు తెలిపింది. అంతేకాక తాను ఇస్లాంలోకి మారడం లేదని తన కొడుకును కూడా దూరం చేశారని, ఇప్పుడు 7ఏళ్ల వయసున్న తన కొడుకు తనను తల్లిగా స్వీకరించడం లేదని కన్నీరుమున్నీరైంది. దేవాలయానికి వెళ్తుండటం వల్ల తనని ఓ రాక్షసురాలిగా తన కొడుకు భావిస్తున్నాడని, అంతలా తన బిడ్డను దూరం చేసేశారని ఆవేదన వ్యక్తంచేసింది. రష్మి ఫిర్యాదు మేరకు, ఆమె భర్త, ఆయన కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు