‘పాకిస్థానీ కేసు’లో ముంబైవాసి అరెస్టు

17 Nov, 2018 10:18 IST|Sakshi

సైబర్‌ పోలీసులకు జూన్‌లో చిక్కిన ఇక్రమ్‌

భారతీయుడినంటూ నకిలీ సర్టిఫికెట్లు సృష్టి

నిజామాబాద్‌ వాసుల విక్రయం

ఇన్నాళ్లకు చిక్కిన తయారీదారుడు రాజ్‌ముల్లీ

సాక్షి, సిటీబ్యూరో: ‘ఆమె’ కోసం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి... సైబర్‌ నేరంలో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పట్టుబడిన పాకిస్థాన్‌ జాతీయుడు మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ కేసులో మరో నిందితుడు చిక్కాడు. ఇతడు వినియోగించిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన ముంబై వాసి రాజ్‌ ముల్లీని శుక్రవారం అరెస్టు చేశారు. బోగస్‌ ధ్రువీకరణలు తయారు చేయడమే వృత్తిగా ఉన్న రాజ్‌ ఇప్పటికే అనేక మందికి వీటిని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్‌ వెళ్లగా అక్కడ ఆమెకు పాకిస్థానీ మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ అలియాస్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. తానూ భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ గా చెప్పుకున్న అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన ఆమె హైదరాబాద్‌ తిరిగి వచ్చేసింది.

దీంతో 2011లో ఉస్మాన్‌ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్‌ వీసాపై వచ్చినట్లు చెప్పాడు. అయితే వాస్తవానికి దుబాయ్‌ నుంచి నేపాల్‌ వరకు విమానంలో వచ్చిన అతను అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అట్నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాడు.  ఆరు నెలల తర్వాత ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచింది. దీంతో కక్షకట్టిన అతను ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు తీయడంతో పాటు వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించానంటూ ఆమెను బెదిరించాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్‌ సందేశం పంపాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జూన్‌ నెలలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్‌ పేరుతో అనేక బోగస్‌ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్‌ పాస్‌పోర్ట్‌ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది.

సర్టిఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసినట్లు గుర్తించారు. ఇతను మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్‌ విద్యా సంస్థలో టెన్త్‌ నుంచి డిగ్రీ చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్‌ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్‌ సహా ఇతర గుర్తింపుకార్డులతో పాటు పాక్‌ పాస్‌పోర్ట్‌నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి వద్ద ఉన్న సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05లో ఇంటర్, 2005–08లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. వీటిని ఇక్రమ్‌ నిజామాబాద్‌కు చెందిన వారి నుంచి ఖరీదు చేసినట్లు తేలడంతో వారినీ పట్టుకున్నారు. ఈ నిందితుల విచారణలోనే ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాలను ముంబైకి చెందిన రాజ్‌ సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో అప్పటి నుంచి రాజ్‌ కోసం గాలిస్తున్న సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బోగస్‌ సర్టిఫికెట్లను తానే తయారు చేస్తానని, దేశ వ్యాప్తంగా ఉన్న ఏజెంట్ల ‘ఆర్డర్ల’ మేరకు విక్రయిస్తానంటూ రాజ్‌ పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు