తీహార్‌ జైలు ‘ఏకాంత కారాగారం’లో..

27 Jan, 2020 10:30 IST|Sakshi
యాసీన్‌ భత్కల్‌ , వకాస్‌ , తెహసీన్‌

యాసీన్, మరో ఇద్దరు ఐఎం ఉగ్రవాదుల అరెస్టుకు ఎదురుచూపులు

ప్రస్తుతం వీరు ఢిల్లీలోని వేర్వేరు జైళ్లల్లో ఉన్న వైనం

2011 నాటి పేలుళ్ల కేసులో ఆగిపోయిన విచారణ

హైదరాబాద్‌ పేలుళ్లలో ఉరిశిక్ష పడ్డ ఉగ్రవాదులు వీరు

సాక్షి, సిటీబ్యూరో: 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిషేధిత దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) కో– ఫౌండర్‌ యాసీన్‌ భత్కల్‌తో పాటు అతడి అనుచరులకూ 2017లో ఉరిశిక్షలు పడ్డాయి. 2011 జూలై 13న ముంబైలోని జవేరీ బజార్, ఓపెరా హౌస్, దాదర్‌ల్లో జరిగిన పేలుళ్ల కేసుల్లోనూ వీరు నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు కొందరి సాంకేతిక అరెస్టు, మరికొందరిపై   అభియోగాల నమోదు పూర్తి కాలేదు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఐఎం ఉగ్రవాదులైన యాసీస్‌ భత్కల్, తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ తబ్రేజ్, జియా ఉర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ వకాస్‌ తదితరుల కోసం ముంబై పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఈ ఉగ్రవాదులు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లతో పాటు అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, పుణే, వారణాసి, బెంగళూరులలో జరిగిన విధ్వంసాలకు సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్నారు. 

తీహార్‌ జైలు ‘ఏకాంత కారాగారం’లో..
కర్ణాటకలోని భత్కల్‌ ప్రాంతానికి చెందిన యాసీన్‌ గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2008లో జరిగిన అహ్మదాబాద్‌ పేలుళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యునానీ వైద్యుడి ముసుగులో నేపాల్‌లో తలదాచుకుని తన అనుచరుల ద్వారా దేశ వ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడ్డాడు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్‌ సెంటర్, 107 బస్టాప్‌ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్‌. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్‌ అండ్‌ కో’కు చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 2017 ఉరి శిక్ష విధించింది. దీంతో ఇక్కడి కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్‌తో పాటు తబ్రేజ్, వఖాస్‌ తదితరుల్ని తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్‌ భత్కల్‌ను తిహార్‌ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్‌మెంట్‌) ఉంచగా... మిగిలిన వాళ్లూ అక్కడి జైల్లోనే ఉన్నారు. ఓపక్క ఢిల్లీ సెషన్స్‌ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను బెంగళూరు న్యాయస్థానం తిహార్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారిస్తోంది. 

ముంబై విచారణకు అడ్డంకులు...
2011 నాటి ముంబై పేలుళ్ల కేసును అక్కడి యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) దర్యాప్తు చేసింది. ఇది అక్కడి ఎంకోకా కోర్టు పరిధిలో ఉంది. జవేరీ బజార్, ఓపెరా హౌస్, దాదర్‌ వి«ధ్వంసాల కేసుల్లో యాసీన్‌ను పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లిన ఏటీఎస్‌ సాంకేతికంగా అరెస్టు చూపింది. అయితే అప్పట్లో పేలుడు పదార్థాలకు తీసుకువెళ్ళి ఆయా చోట్ల పెట్టిన తబ్రేజ్, హడ్డీలపై ఇంకా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. మరోపక్క యాసీన్‌పై అభియోగాలు నమోదు చేయాలన్నా అతడిని కోర్టు ఎదుట హాజరపరచాల్సి ఉంది. భద్రతాపరమైన అంశాల నేపథ్యంలో ఈ ఉగ్రవాదుల్ని ఢిల్లీలోని తిహార్‌ జైలు దాటి బయటకు తీసుకువెళ్లకుండా కేంద్రం ఓ ఉత్తర్వు జారీ చేసింది. యాసీన్‌ హైదరాబాద్‌ జైల్లో ఉండగానే అతడిని తప్పించడానికి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో పాటు ఐసిస్‌ వంటివీ ప్రయత్నిస్తున్నట్లు నిఘా              వర్గాలకు సమాచారం అందింది. దీంతో కేసు విచారణ కోసం చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ పరిణామా ల నేపథ్యంలోనే కేంద్రం ఈ ఉగ్రవాదుల్ని తిహార్‌ జైల్లోనే కట్టుదిట్టమైన భద్రత             మధ్య     ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఏటీఎస్‌ అధికారులు ఎంకోకా కోర్టుకు విన్నవించారు.  

జాప్యం కోసమే అడ్డంకుల సృష్టి..
పేలుళ్లు చోటు చేసుకుని తొమ్మిదేళ్లు గడిచిపోవడం, ఈ ఉగ్రవాదుల్ని ఢిల్లీ నుంచి బయటకు తీసుకువచ్చే ఆస్కారం లేకపోవడంతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ చేయించాలని కోరుతూ ఏటీఎస్‌ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అదే పంథాలో అభియోగాలు నమోదు చేస్తామని కోరారు. దీన్ని వ్యతిరేకిస్తూ యాసీన్‌ సహా ఇతర నిందితులు కోర్టులో తమ న్యాయవాది ద్వారా పిటిషన్‌ దాఖలు చేయించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఈ పిటిషన్‌ దాఖలు పూర్వాపరాలను నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేసు విచారణకు అడ్డంకులు సృష్టించడం ద్వారా జాప్యం జరిగేలా చేయడానికే యాసీన్‌ ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నాడని భావిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌ పేలుళ్ల కేసులో యాసీన్, తబ్రేజ్, వఖాస్‌లకు ఉరి శిక్ష పడింది. దీనికి సంబంధించిన ఇతర ఫార్మాలిటీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని కేసుల విచారణ సైతం పూర్తయితే ఉరి శిక్ష అమలు చేసే ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం కావాలంటే ఇతర రాష్ట్రాల్లోని కేసుల విచారణ ముందుకు సాగకుండా చేయాలని యాసీన్‌ యోచిస్తున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికోసమే ఇలాంటి రకరకాల కారణాలతో పిటిషన్ల దాఖలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నాయి. మరోపక్క భద్రతా కారణాల నేపథ్యంలో యాసీన్‌ భత్కల్‌ లాంటి ఉగ్రవాదిని విచారణ కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని అధికారులు చెప్తున్నారు. గతంలో ఓ సందర్భంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ తీసుకువెల్లడానికి సరిహద్దు భద్రతా దళానికి చెందిన హెలికాప్టర్‌ వాడాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా