కుక్క మొరిగిందని దాడి.. గుండెపోటుతో మృతి..

13 Feb, 2020 12:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళకు చెందిన పెంపుడు కుక్క మొరిగిందని మరో నలుగురు మహిళలు ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు గుండుపోటుతో మరణించింది. ఈ విషాద ఘటన డోంబివ్లిలో మంగళవారం చోటుచేసుకుంది.  వివరాలు.. నాగమ్మ శెట్టి(35) అనే వితంతు మహిళ తన కూతురితో కలిసి డొంబివ్లిలోని మన్పాడలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఆమె పెంపుడు కుక్క ఓ రోజు ఏకధాటిగా అరవడంతో అదే వీధికి చెందిన నలుగురు మహిళలు భరించలేక సదరు మహిళను కుక్క అరవకుండ చూసుకోమని హెచ్చరించారు. అయినప్పటికీ కుక్క అదే పనిగా అరవడంతో ఆవేశానికి లోనైన మహిళలు కుక్క యజమానితో వాగ్వాదానికి దిగారు. వీరి మధ్య మాటలు ముదిరి గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అనంతరం ఆ నలుగురు మహిళలు దాడి చేసి కుక్క యజమానిని కింద పడేసి ఛాతిపై కాళ్లతో తన్నారు. దాడిలో గాయపడిన మహిళ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై  ఫిర్యాదు చేసింది. అనంతరం ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు చికిత్స అందిస్తుండగా మరణించింది. 

ఈ ఘటనపై డీసీపీ వివేక్‌ పన్సారీ మాట్లాడుతూ.. బాధితురాలైన నాగమ్మ శెట్టిపై నలుగురు మహిళలు గొడవ పడినట్లు ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముందుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు ఆయన చెప్పారు. అయితే అది పట్టించుకోని ఆ మహిళ ఇంటికి వెళ్లిందని, ఆ తరువాత తనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. చికిత్స చేస్తుండగా మధ్యలోనే ఆమె మరణించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో మృతురాలు గుండె పోటుతో మరణించినట్లు డాక్టర్లు వెల్లడించినట్లను డీసీపీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు