గత జన్మలో ఆమే నా భర్త.. వివాహిత ఉన్మాదం

10 Sep, 2018 11:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ముంబైకి చెందిన ఓ వివాహిత బీటెక్‌ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించింది. ‘గత జన్మలో నువ్వే నా భర్త.. ఇప్పుడు కూడా నువ్వు నాతోనే జీవించాలి’ అంటూ ఆమెను వేధించింది. పోలీసుల వివరాల ప్రకారం... ముంబైకి చెందిన వెరోనికా బరోడే అలియాస్‌ కిరణ్‌(35) ఓ ఇనిస్టిట్యూట్‌లో ట్యూటర్‌గా పనిచేస్తోంది. ముంబైలోని టాటా మెమోరియల్‌ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆమెకు ఇండోర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని(22) పరిచయమయింది. ఈ క్రమంలో ఇద్దరూ ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. క్యాన్సర్‌ పేషెంట్‌ అయిన తన తల్లిని చూసుకునేందుకు సదరు విద్యార్థిని కొన్ని రోజులు ముంబైలో ఉంది. దీంతో కిరణ్‌ ఆమెకు తరచుగా ఫోన్‌ చేయడం మొదలుపెట్టింది.

స్నేహం పెంచుకుని.. వేధింపులు
విద్యార్థిని తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తూ.. కిరణ్‌ ఆమెతో స్నేహం పెంచుకుంది. కాగా గత కొన్ని రోజుల నుంచి ‘గత జన్మలో నువ్వే నా జీవితభాగస్వామివి. కాబట్టి ఈ జన్మలో కూడా నా భర్తగా ఉండే హక్కు నీకు మాత్రమే ఉంది. మనం పెళ్లి చేసుకుందాం’  అంటూ ఆమెను వేధించసాగింది. కిరణ్‌ వేధింపులతో విసిగిపోయిన విద్యార్థిని ఆమె ఫోన్‌ ఎత్తడం మానేసింది. ఈ క్రమంలో ఉన్మాదిగా మారిన కిరణ్‌... ఇండోర్‌లో విద్యార్థిని చదువుతున్న కాలేజీకి వెళ్లి ఆమె గురించి ఆరా తీసింది. ఆమె ముంబైలోని ఉందని తెలుసుకుని.. తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించింది.

కానిస్టేబుల్‌ సాయంతో..
విద్యార్థినిని దక్కించుకునేందుకు.. ఓ పోలీసు కానిస్టేబుల్‌ సహాయం కోరిన కిరణ్‌.. విద్యార్థిని ఫ్లాట్‌కు వెళ్లి ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఊహించని పరిణామానికి కంగుతిన్న విద్యార్థిని.. వెంటనే తేరుకుని సేఫ్టీ అలారం మోగించింది. దీంతో అపార్టుమెంటులో ఉన్న వారంతా ఆమె ఫ్లాట్‌ వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కిరణ్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌లను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. డబ్బు కోసం విద్యార్థిని కిడ్నాప్‌ చేసేందుకు నిందితులు ప్రయత్నించారని భావించిన పోలీసులు విచారణలో కిరణ్‌ చెప్పిన కారణం విని విస్తుపోయారు. ఈ ఘటనతో బెంబేలెత్తిపోయిన విద్యార్థిని తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరింది.

మరిన్ని వార్తలు