ముసలయ్యా.. ముంచావయ్యా!

26 Jun, 2020 13:25 IST|Sakshi
నిందితుల అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

సెటిల్‌మెంట్‌ పేరుతో మిత్రుడినే మట్టుబెట్టిన వైనం

తల ఒకచోట, మొండెం మరోచోట

కాల్‌ డేటా ఆధారంగా నిందితుల పట్టివేత

ప్రధాన నిందితుడు ఎర్రగుంట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌  

వివరాలు వెల్లడించిన ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌  

ఆయనో పెద్దమనిషి.. గతంలో మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం... సెటిల్‌మెంట్‌ పేరుతో స్నేహితుడినే మట్టుపెట్టాడు. ముప్పై ఏళ్ల బంధాన్ని డబ్బు కోసం అతికిరాతకంగా అంతమొందించాడు. ముక్కలుగా నరికేసి ఆధారాలు లేకుండా చేయాలనుకున్నాడు. తన బంధువు సహాయంతో తలను ఒక పోలీసు స్టేషన్‌ పరిధిలో, మొండాన్ని తన ఇంటి నీటి తొట్టెలో పాతిపెట్టి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే పోలీసులు రెండు రోజుల్లోనే హత్య కేసును చేధించి నిందితులను కటకటాల పాలు చేశారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనమైంది. నిందితుల అరెస్టు వివరాలను ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ గురువారం మీడియాకు తెలిపారు. 

కడప అర్బన్‌/ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొంది మహాత్మానగర్‌లో నివసిస్తున్న బాలిశెట్టి వెంకట రమణయ్య (60), ఎర్రగుంట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ హనుమగుత్తి ముసలయ్యల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. గతేడాది ముసలయ్య వెంకట రమణయ్య దగ్గర దాదాపు రూ. 30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇందుకోసం  కడపలోని తన 18 సెంట్ల స్థలాన్ని ఆయకంగా పెట్టాడు. ఈ మధ్య కాలంలో డబ్బులు ఇవ్వాలని హతుడు ముసలయ్యపై ఒత్తిడి తీసుకు వచ్చేవాడు. ఈ క్రమంలో తన స్థలం డాక్యుమెంట్లను తీసుకొస్తే డబ్బు ఇస్తానని ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం హతునికి ప్రధాన నిందితుడు ఫోన్‌ చేశాడు. అతను డాక్యుమెంట్లను కూడా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో డబ్బులు తీసుకొస్తానని వంట గదిలోకి వెళ్లి రోకలిబండను తీసుకొచ్చి వెంకట రమణయ్య తలపై వెనక నుంచి బాదాడు. దీంతో కిందపడిపోయిన వెంకట రమణయ్య చనిపోయాడని నిర్ధారించుకుని శరీరాన్ని ముక్కలుగా చేయాలనుకున్నాడు. (రిటైర్డు ఉద్యోగి హత్య.. తల లభ్యం)

మచ్చు కత్తితో తలను మొండెం నుంచి వేరు చేశాడు. తర్వాత ఒక్కసారిగా వెన్నులో భయం పుట్టి రక్తపు మరకలున్న ప్రదేశాన్ని కడిగేశాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో కత్తి ప్రతాప్‌రెడ్డి దగ్గర స్కూటీ తీసుకుని హతుని సెల్‌ఫోన్లను పొట్లదుర్తి అయ్యప్పస్వామి గుడి దగ్గరున్న ఎకో పార్కు వద్ద పడేశాడు. రాత్రి 8 గంటల సమయంలో తన సోదరుని కుమారుడైన శ్రీనాథ్‌కు విషయాన్ని చెప్పాడు. ఇద్దరూ కలిసి మొండెంలేని శరీరాన్ని ఇంటి ఆవరణంలో బాత్‌రూం వద్దనున్న నీళ్ల తొట్టిలో వేసి ఇసుక, రాళ్లను కప్పివేశారు. ఆ రాత్రికి అక్కడే నిద్రించారు. ఉదయాన్నే హతుడి తలను స్టీల్‌ క్యారియర్‌లో, అతని దుస్తులు, ఇంటిని శుభ్రపరిచిన దుస్తులను కవరులో పెట్టుకుని మోటారు సైకిల్‌పై గువ్వలచెరువు ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ తలను, దుస్తులను అడవిలోకి విసిరేశారు. అక్కడి నుంచి కడప ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. ఈ నేరానికి ఉపయోగించిన కత్తిని బస్టాండు వద్ద ఉన్న టాయిలెట్స్‌ వెనుకవైపు పడేశారు. తర్వాత తన కూతురు ఇంటికి వెళ్లాడు. తనతోపాటు వచ్చిన శ్రీనాథ్‌ను ఎర్రగుంట్లకు పంపించి వేశాడు. తిరిగి ఈనెల 22వ తేదీ ఉదయం ఎర్రగుంట్లకు వెళ్లి మళ్లీ ఇంటిని శుభ్రపరిచి ఎవరికీ అనుమానం రాకుండా కడపకు చేరుకున్నారు.

చివరి ఫోన్‌కాల్‌ ఆధారంగా....
 ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బాలిశెట్టి వెంకట రమణయ్యకు ప్రధాన నిందితుడు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ముసలయ్య చివరి ఫోన్‌ కాల్‌ చేశాడు. దీని ఆధారంగానే నిందితుడిని గుర్తించి పట్టుకోగలిగారు. ఈ సంఘటనలో ఇంకా ఏవైనా కారణాలున్నాయన్న విషయంపై సాంకేతికంగా విచారణ చేపడుతున్నామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. 

పోలీసు అధికారులకు నగదు రివార్డులు
 కేవలం రెండు రోజుల వ్యవధిలోనే హత్య కేసును చేధించి నిందితులను అరెస్టు చేసిన కడప డీఎస్పీ యు.సూర్యనారాయణ, సీఐలు సదాశివయ్య, ఉలసయ్య, ఎస్‌ఐలు మల్లికార్జునరెడ్డి, రమేష్, రాజరాజేశ్వర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుళ్లు ప్రసాద్, విశ్వనాథరెడ్డిలను ఎస్సీ అభినందించారు. నగదు రివార్డులను అందజేసి సత్కరించారు.

మరిన్ని వార్తలు