ఏసీబీ వలలో మునిసిపల్‌ అధికారులు

8 Aug, 2019 10:53 IST|Sakshi
ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ మున్సిపల్‌ అధికారులు

కాంట్రాక్టర్‌ నుంచి డబ్బులు డిమాండ్‌

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

మునిసిపల్‌ మేనేజర్‌తో సహా మరో ఇద్దరి అరెస్ట్‌

దుండిగల్‌: బిల్లు మంజూరు చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ను డబ్బులు డిమాండ్‌ చేసి ముగ్గురు మునిసిపల్‌ అధికారులు ఏసీబీ సిబ్బంది బుధవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన రాజారామ్‌ కాంట్రాక్టర్‌గా పని చేసేవాడు. రెండేళ్ల క్రితం అతను బహదూర్‌పల్లి గ్రామంలో రూ. 7 లక్షల వ్యయంతో రోడ్డు, మంచినీటి ట్యాంక్‌ నిర్మాణ పనులు పూర్తి చేశాడు. ఇందుకుగాను గ్రామ పంచాయతీ అధికారులు రూ. 4 లక్షల బిల్లులు మంజూరు చేసి మరో రూ. 3 లక్షలు పెండింగ్‌లో పెట్టారు. గత ఏడాది గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా బిల్లులు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.   అప్పట్లో బహదూర్‌పల్లి పంచాయతీ సెక్రటరీగా పని చేసిన గోవింద్‌రావు ప్రస్తుతం దుండిగల్‌ మున్సిపల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బిల్‌ కలెక్టర్లుగా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి, కిరణ్‌ మున్సిపల్‌లోను అదే హోదాల్లో  కొనసాగుతున్నారు.

బిల్లులు మంజూరు చేసేందుకు రూ. 50 వేలు ఇవ్వాలని గోవింద్‌రావు, మహేందర్‌రెడ్డి, కిరణ్‌ వేధిస్తున్నారు.  అందుకు అంగీకరించిన రాజారామ్‌ ఏసీబీ  అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం బుధవారం  బిల్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డికి ఫోన్‌ చేయగా ఆఫీసు పని నిమిత్తం కోర్టుకు వచ్చానని, బహదూర్‌పల్లి వార్డు కార్యాలయంలో ఉన్న మరో బిల్‌ కలెక్టర్‌ కిరణ్‌ కు ఇవ్వాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి రూ. 11 వేలు అందజేశాడు. అనంతరం దుండిగల్‌ మునిసిపల్‌ కార్యాలయంలో మేనేజర్‌ గోవింద్‌రావుకు రూ.7వేలు, రూ.19 వేల చెక్కు, జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణారెడ్డికి రూ.13 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి గురువారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ, ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు, గంగాధర్, మాజిద్‌ అలీఖాన్, రామలింగారెడ్డి పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా