వీడని మిస్టరీ..!

29 Apr, 2019 13:10 IST|Sakshi
హత్య జరిగిన చోట కిందపడిన తుపాకీ కోకాను పరిశీలిస్తున్న పోలీసులు (ఫైల్‌)

దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్నా కొలిక్కిరాని మురళీకృష్ణ హత్య కేసు

పోలీసులే నీరు గార్చేశారంటున్న ప్రజలు

విజయనగరం ,పార్వతీపురం: ఎంతటి కేసునైనా తమ డేగ కళ్లతో పసిగట్టి హంతకులను పట్టుకుంటారనేది పోలీసుశాఖకు ఉన్న గౌరవం. ఏదో ఒక ఆధారాన్ని ఆధారంగా చేసుకొని తీగ లాగితే డొంక కదిలినట్లు కేసును ఛేదించడం  పోలీస్‌ శాఖకే చెందుతుంది. ఒక్కోసారి కేసుకు సంబంధించిన ఆధారాలు స్థానిక పోలీసులకు లభించని సమయంలో సీసీఎస్‌ పోలీసుల సహకారం తీసుకుంటారు. వీరు రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎంతటి కేసునైనా ఏదో ఒక ఆధారంతో కొలిక్కి తీసుకువస్తుంటారు. ఇక విషయంలోకి వెళ్తే.. పార్వతీపురంలో 2017 జూలై 22న సుమిత్రా కలెక్షన్స్‌ భాగస్వామి మురళీకృష్ణ తుపాకీ కాల్పులకు మృతిచెందాడు. ఇలాంటి సంఘటనే పక్క మండలమైన బొబ్బిలిలో జరిగితే వారం రోజుల్లో నిందితులను పట్టుకున్న పోలీసులు మురళీకృష్ణ హత్య కేసులో మాత్రం నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ప్రశాంతంగా జీవనం సాగించే పార్వతీపురం పట్టణంలో మొట్టమొదటి సారిగా తుపాకీ చప్పుళ్లు మోతకు ఒక వ్యాపారి బలికావడం.. పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.  నేరస్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పట్టణ ప్రజలంతా వేయికళ్లతో ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు. కానీ 21 నెలలు పైబడినా నేటికీ వ్యాపారి మురళీకృష్ణ హత్యకు సంబంధించి ఒక్క క్లూ కూడా సంపాదించకపోవడం, నేరస్తులను పట్టుకోకపోవడంతో పోలీసులపై ఉన్న నమ్మకం రోజురోజుకి ప్రజల్లో సన్నగిల్లుతోంది. జిల్లాకు కొత్త ఎస్సీగా దామోదర్‌ వచ్చారు. పార్వతీపురం పట్టణానికి కొత్త ఏఎస్పీగా సుమిత్‌ గార్గ్‌ వ్యవహరిస్తున్నారు. వీరి సారథ్యంలోనైనా నిందితులు పట్టుబడతారేమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మౌనంతో మరుగున పడుతున్న కేసు
మురళీకృష్ణ హత్యకు సంబంధించి అనేక విమర్శలతో పాటు అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. పోలీసులు తలుచుకుంటే ఛేదించలేని కేసంటూ ఉండదని, కానీ మురళీకృష్ణ్ణ కేసును ఛేదించకపోవడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మృతుడు మురళీకృష్ణ్ణ కుటుంబ సభ్యులనుంచి ఫిర్యాదు లేకపోవడం.. తమ భర్తను చంపింది ఎవరో తేల్చాలని మృతుడి భార్య పోలీసులను ఆశ్రయించకుండా మౌనం వహించడం వెనుక అనేక కారణాలు ఉండే ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు అనుమానితుల గురించి చెప్పకపోవడం వల్లే కేసు దర్యాప్తు నెమ్మదిస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఫిర్యాదు చేయనంత మాత్రాన.. కుటుంబ సభ్యులు సహకరించనంత మాత్రాన జరిగింది హత్య కాదా, చంపింది తుపాకీతో కాదా, నేరస్తులను పట్టుకోరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఎన్నాళ్లకు నిందితులను పట్టుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు