ఎట్టకేలకు దొరికాడు

27 Jun, 2019 10:54 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : అతని వయస్సు 28 సంవత్సరాలు, 18కి పైగా కేసులున్నాయి. మహారాష్ట్రల్లోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, బ్యాంక్‌ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డాడు. నెల్లూరులో మహేంద్రసింగ్‌ను తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనతో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌గా మారిన సురేష్‌భూప్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌ను నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం నగరంలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. గతేడాది నవంబర్‌ 3వ తేదీన మహేంద్రసింగ్‌ రాజ్‌పురోహిత్‌ను గుర్తుతెలియని దుండగులు తపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటనపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఆస్తి విభేదాల నేపథ్యంలో మహేంద్రసింగ్‌ను అతని అన్న కుమారుడు విక్రమ్‌సింగ్‌ కిరాయి హంతకులచే హత్య చేయించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు హత్య జరిగిన కొద్దిరోజుల వ్యవధిలోనే విక్రమసింగ్‌తోపాటు మరో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఆదేశాల మేరకు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందం నాలుగురోజుల క్రితం ముంబైలో ఉంటున్న ఏ2 సురేష్‌భూప్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌ను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన పిస్టల్‌కు సంబంధించిన విడి భాగాన్ని (ట్రిగ్గర్‌ను) స్వాధీనం చేసుకుని నెల్లూరుకు తరలించారు. దొంగగా మారాడు రాజస్థాన్‌ రాష్ట్రం జూలూరు జిల్లాకు చెందిన సురేష్‌భూప్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌ మహారాష్ట్రలోని పూణేలో ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్నాడు. చెడు వ్యవసనాలకు బానిసైన నిందితుడు దొంగగా మారాడు. స్నేహితులతో కలిసి నేరాలకు పా ల్పడేవాడు.

పూణేలో ఓ హత్యకేసులో సైతం నిందితుడిగా ఉన్నాడు. దూరపు బంధువైన మృతుడు మహేంద్రసింగ్‌ను అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. ఈక్రమంలో హత్యకేసులో ఏ1 నిందితుడు విక్రమ్‌సింగ్‌ సురేçష్‌ను కలిశాడు. మహేంద్రసింగ్‌ను హత్య చేయాలని పథకం రచించారు. అందుకుగానూ రూ.8 లక్షలు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంటికి వెళుతుండగా.. సురేష్‌ తన మిత్రులతో కలిసి హత్యకు పక్కా ప్రణాళిక వేశాడు. నెల్లూరుకు చేరుకుని పలుమార్లు రెక్కీవేశారు. సరైన సమయం కోసం వేచిచూడసాగారు. నవంబర్‌ మూడోతేదీ రాత్రి మహేంద్రసింగ్‌ టెక్కేమిట్ట సమీపంలోని తన షాపును మూసి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండడాన్ని దుండగులు గమనించి బైక్‌పై అతడిని వెంబడించారు. దగ్గరికి వెళ్లగానే తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసి పరారయ్యారని డీఎస్పీ వెల్లడించారు.

ఈ ఘటనలో ద్విచక్రవాహనం సురేష్‌ నడిపాడని డీఎస్పీ తెలిపారు. అనంతరం నిందితులు హత్యకు ఉపయోగించిన పిస్టోల్‌ను భాగాలుగా విడగొట్టేశారు. మరికొందరు నిందితులు ఉన్నారని వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు ఎంతగానో సహకరించారని డీఎస్పీ తెలిపారు. తనతోపాటు ముంబైకు వచ్చిన చిన్నబజారు పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ అన్వర్‌బాషా, ఎస్సైలు జగత్‌సింగ్, హనీఫ్, కానిస్టేబుల్స్‌ అల్తాఫ్, షంషుద్దీన్, మహేంద్రరెడ్డిలను ఎస్పీ అభినందించారని డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌బాషా, ఎస్సైలు జగత్‌సింగ్, హనీఫ్, బలరామయ్య తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు