బండరాళ్లతో మోది దారుణ హత్య

2 Jun, 2018 07:34 IST|Sakshi
అర్క కమ్ము (ఫైల్‌) ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ

ఆదివాసీని కొట్టిచంపిన  దుండగులు

విచారణకు తుడుందెబ్బ డిమాండ్‌

హంతకులను పట్టుకుంటాం: డీఎస్పీ

సిరికొండ(బోథ్‌) : బండరాళ్లతో తలపై మోది ఓ గిరిజనుడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని సోన్‌పెల్లి శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాంజీగూడ గ్రామానికి చెందిన అర్క కమ్ము (48) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి రైతుబంధు డబ్బులు రూ.10వేలు తీసుకొని సొంత పనుల నిమిత్తం ఆదిలాబాద్‌కు వెళ్లాడు. గురువారం ఉదయం, సాయంత్రం ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. నేను బయలు దేరాను.. నా వెంట ఒక స్నేహతుడు కూడా ఉన్నాడని భార్య హీరాబాయితో చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. రాత్రి మరోసారి కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ వచ్చింది. శుక్రవారం ఉదయం సోన్‌పెల్లి గ్రామశివారులో శవమై తేలాడు.

అటుగా వెళ్లిన వారు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇచ్చోడ సీఐ సతీశ్‌కుమార్, ఉట్నూర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లుతో పాటు సిరికొండ ఇన్‌చార్జి ఎస్సై రాముగౌడ్, నేరడిగొండ ఎస్సై వెంకన్నతోపాటుగా పోలీసులు సం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మొదట డబ్బుల కోసమే ఎవరో కమ్మును కొట్టి చంపారని నిర్ధారణకు వచ్చారు. కమ్ము షర్టు, ధోతిని విప్పి చూడగా రూ.8వేలు లభించాయి. ఇది డబ్బుల కోసం అయి ఉండదని, ఎవరో కక్షపూరితంగా హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం అక్కడికి చేరుకున్నా రు. శవాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం బోథ్‌ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా కమ్ము సెల్‌ఫోన్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి

రాంజీగూడకు చెందిన ఆదివాసీ గిరిజనుడు అర్క కమ్ము హత్యపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, హంతకులను పట్టుకోవాలని ఆదివాసీ గిరిజన హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, జిల్లా అధ్యక్షుడు జలైజాకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కమ్ము హత్యకు గురైన ప్రాంతానికి వారు సందర్శించి విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ తరుణంలో ఓ ఆదివాసీ గిరిజనుడు హత్యకు గురికావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

 హంతకులను పట్టుకుంటాం..

కమ్ము హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి హంతకులను వెంటనే పట్టుకుంటామని ఉట్నూర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కమ్ము హత్యకు గురైన ప్రాంతాన్ని యన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కమ్ము హత్యకు కారణాలను, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో విచారణ జరిపిస్తున్నామని, ముందుగా ఇంటి నుంచి కమ్ము ఎవరితో ఎక్కడికి వెళ్లాడు..ఎవరితో తిరిగాడనే దానిపై విచారణ జరుపుతున్నాన్నారు. ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

మరిన్ని వార్తలు