బీమా డబ్బు కోసమే చంపేశారు !

23 Jan, 2019 13:26 IST|Sakshi
అంబులెన్స్‌లో భర్త మృతదేహం వద్ద కూర్చున్న మాధవి

భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య

ఆస్తి కోసం తననూ చంపుతారని ఆందోళన

వాటా తేలే వరకూ ఖననం చేయరాదన్న బంధువులు  

అగ్రిమెంటు రాసిచ్చాక అంతిమ సంస్కారం పూర్తి

పుట్టపర్తి అర్బన్‌: ఆస్తి కోసమే తన భర్త పవన్‌కుమార్‌ను చంపేశారని భార్య మాధవి ఆరోపించింది. తనను కూడా చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్తిలో వాటా తేలే వరకూ అంత్యక్రియలు చేయరాదని అడ్డుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుట్టపర్తి మండలం పెడపల్లికి చెందిన ఆకుల రవి కుమారుడైన చేనేత కార్మికుడు పవన్‌కుమార్‌ ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లెలో హత్యకు గురయ్యాడు. సోమవారం ఉదయం తండ్రి రవి, చిన్నకుమారుడు గణేష్, బంధువులు మదనపల్లెకు వెళ్లి మృతదేహాన్ని తరలించేందుకు ప్రత్యేక వాహనం తీసుకొచ్చారు. అక్కడి పోలీసులకు అనుమానం రావడంతో తండ్రి రవి, తమ్ముడు గణేష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. దీంతో బంధువులే మంగళవారం ఉదయం పవన్‌ కుమార్‌ మృతదేహాన్ని స్వగ్రామం పెడపల్లికి తీసుకొచ్చారు. శ్మశాన వాటికలో గుంత తీశారు. అంబులెన్స్‌లోంచి మృతదేహాన్ని తీసుకురాగానే పవన్‌కుమార్‌ భార్య మాధవి పూడ్చకూడదని అడ్డం తిరిగింది.

వాటా తేల్చాల్సిందే!
బీమా (ఇన్సూరెన్స్‌) డబ్బుల కోసం తన భర్తను చంపారని, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడు తననూ చంపుతారని, కాలయాపన లేకుండా ఆస్తిలో వాటా ఇస్తేనే పూడ్చనిస్తానని మాధవి ఆందోళనకు దిగింది. ఆరేళ్ల కిందట పవన్‌కుమార్‌ అన్న విజయ్‌కుమార్‌ నడుపుతున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు కూరగాయల వ్యాపారులు చనిపోవడం జిల్లాలో సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి పవన్‌కుమార్, విజయ్‌కుమార్‌ల స్వంత తల్లి (ప్రస్తుతం గ్రామంలో లేదు) కోర్టుకు వెళ్లింది. దీంతో విజయ్‌కుమార్‌కు సంబంధించి ఇన్సూరెన్స్‌ కింద రూ.8 లక్షల వరకు వచ్చింది. ఈ మొత్తంలో వాటా ఇవ్వనందుకే తన భర్త పవన్‌కుమార్‌ను హత్య చేశారని మాధవి ఆరోపిస్తోంది. ఆస్తిలో తమకు వాటా ఇచ్చే వరకు అంత్యక్రియలు చేయరాదని భీష్మించింది. బంధువులు ఆమెకు అండగా నిలబడ్డారు. ఉదయం 11 గంటలకు వచ్చిన మృతదేహాన్ని రాత్రి వరకు పూడ్చకుండా చర్చలు జరుపుతూనే ఉన్నారు. చర్చలు తెగక పోవడం పవన్‌కుమార్‌ పినతల్లి శ్యామల ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో చివరకు పుట్టపర్తి నుంచి అంబులెన్స్‌ను పిలిపించి మృతదేహాన్ని గ్రామంలోని రవి ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని ఊరిలోకి తీసుకెళ్లకూడదని గ్రామస్తులు అడ్డుకోవడంతో రోడ్డు వద్దే నిలిపివేశారు. గ్రామస్తులు, మాధవి బంధువులు చివరకు రూ.3.5 లక్షలు వెంటనే ఇచ్చే విధంగా అగ్రిమెంటు పత్రాన్ని తయారు చేసి పవన్‌ పినతల్లి శ్యామలతో, గ్రామ పెద్దలతో సంతకాలు చేయించిన తర్వాత రాత్రి 7 గంటలకు పవన్‌కుమార్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.  

మరిన్ని వార్తలు