భర్తను చంపేందుకు బావతో కలిసి కుట్ర

12 Jun, 2018 14:43 IST|Sakshi

బాధితుడి భార్యే సూత్రధారి

అక్క భర్తతో వివాహేతర బంధమే కారణం

ముగ్గురు నిందితుల అరెస్ట్‌ 

సీసీ కెమెరా పుటేజీలతో కేసు ఛేదించిన ఏసీపీ వెంకటేశ్వర్‌బాబు

వరంగల్ , రఘునాథపల్లి : బావతో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని పెళ్లయిన ఆరు నెలలకే భర్త ను కడతేర్చాలని చూసింది ఓ ప్రబుద్ధురాలు. తన అక్క భర్తతో కలిసి తన భర్తను హత్య చేసేందుకు ఆమె చేసిన కుట్ర పోలీసుల విచారణలో బయటపడింది.జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఏసీపీ వెంకటేశ్వరాబు కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ఎంబరి పోషయ్య పెద్ద కూతురు గాయత్రికి విజయవాడకు చెందిన పత్తి  శ్రీనుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది.దీంతో పోషయ్య చిన్నకూతురు జ్యోతి అప్పుడప్పుడు విజయవాడలోని అక్క ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో తన బావ శ్రీనుతో ఆమెకు శారీరక సంబంధం ఏర్పడింది. ఆరు నెలల క్రితం జ్యోతికి రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లికి చెందిన గాజుల రాజుతో వివా హమైంది. అయినప్పటికీ తనకు ఈ పెళ్లి ఇష్టం లే దని నీతో ఉంటానని జ్యోతి తన బావతో చెప్పేది. 

మూడు నెలల్లో 1500 కాల్స్‌.. 
రాజుతో ఇంకా ఎన్నాళ్లు ఉండాలి.. ఆయన్ని చంపు అని జ్యోతి తరచూ బావ శ్రీనుతో ఫోన్‌లో మాట్లాడేది. మూడు నెలలుగా పత్తి శ్రీనుతో 1500 సార్లు ఫోన్‌లో మాట్లాడింది. జ్యోతి కోరికపై రాజును ఎలాగైనా చంపాలని శ్రీను ప్లాన్‌ వేశాడు.ఇందులో భాగంగా మే  20న విజయవాడ నుంచి అశ్వరావుపల్లికి చేరుకొని ఊరు చివర పొదల్లో మరుగుదొడ్డి శుభ్రం చేసే యాసిడ్‌ బాటిల్‌ దాచాడు. అదే నెల 27న విజయవాడలో పేపర్‌ ఫ్యాక్టరీలో పని చేసే సాడి వెంకటదుర్గారావు, మరో బాలుడికి రూ.20 వేలు ఇస్తానని సుపారీ మాట్లాడుకుని వారితో గ్రామానికి వచ్చాడు.

ఆ రోజు రాజు ఆచూకీ లభించకపోవడంతో  తిరిగి వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 3న పొలాల వద్ద రాజు గొర్రెలను మేపుతుండగా  గుర్తించిన శ్రీను తాను పొదల్లో దాచుకొని వెంకటదుర్గారావు, బాలుడికి యాసిడ్‌ బాటిల్‌ ఇచ్చి పంపాడు.ఇద్దరు రాజు ముఖంపై యాసిడ్‌ పోసి గొంతునులిపి చంపేందుకు యత్నిస్తుండగా సమీపంలో ఉన్న గొర్రెల కాపరులు గుర్తించి కేకలు వేయడంతో పారి పోయారు. ఈ ఘటనలో గాయపడిన రాజు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇటీవల ఇంటికి చేరుకున్నాడు.

జ్యోతి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా, గ్రామంలోసి సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితులను సులభంగా గుర్తించారు. రఘునాథపల్లి బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కుట్ర, హత్యాయత్నం సెక్షన్ల కింద జ్యోతి, శ్రీను, వెంకటదుర్గారావుపై కేసు నమోదు చేశారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరగా ఛేదించిన జనగామ రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్సై రంజిత్‌రావును ఏసీపీ అభినందించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు