వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం 

19 Oct, 2019 11:02 IST|Sakshi
గాయపడిన గొర్లె శివాజీ గణేష్‌ , టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీనబంధు

కోష్ట, కామధేనువు గ్రామాల వద్ద దాడులు 

తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు 

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు 

జిల్లాలో వేర్వేరు చోట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి రణస్థలం మండలం కోష్ట, శుక్రవారం నందిగాం మండలం కృష్ణరాయపురం గ్రామాల వద్ద ఈ దాడులు జరిగాయి. రోజురోజుకూ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

రణస్థలం:  కోష్ట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గొర్లె శివాజీగణేష్‌పై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. స్థానికులు, జె.ఆర్‌.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్‌ గురువారం రాత్రి 8 గంటల సమయంలో కోష్ట గ్రామంలోని తన నివాసానికి వెళుతుండగా ఇంటికి సమీపంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్‌ బైకుపై వచ్చి ‘గణేష్‌ అంటే నువ్వేనా..’ అని అడిగారు. అవును అని చెప్పగానే బైకు నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు రాడ్డు, కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. గణేష్‌ కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితులు బైకుపై పరారయ్యారు. గణేష్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటినా శ్రీకాకుళం రిమ్స్‌కు  తరలించారు.

మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై గణేష్‌ మాట్లాడుతూ గతంలో బీజీపీ నాయకుడు ఎన్‌.ఈశ్వరరావు, టీడీపీ నేత పిసిని జగన్నాథం చేసిన అకృత్యాలపై ప్రశ్నించినందుకు కక్ష గట్టి దాడి చేయించి ఉంటారని తెలిపాడు. గణేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్లుగా ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వద్ద గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వైఎస్సార్‌ సీపీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేసేవాడు. నరసన్నపేట వద్ద డోల ఈయన స్వగ్రామం. దాడి ఘటన తెలిసిన వెంటనే జె.ఆర్‌.పురం ఎస్సై బి.అశోక్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

బోరుభద్ర పంచాయతీలో..
నందిగాం:  బోరుభద్ర పంచాయతీ కామధేనువు గ్రామానికి చెందిన కణితి దీనబంధుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్వగ్రామం నుంచి తన ద్విచక్రవాహనంపై కృష్ణరాయపురం వెళుతుండగా గ్రామ మలుపు వద్ద కొందరు వ్యక్తులు ఆపారు. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు, వెనుక ఓ వ్యక్తి, రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. బైకును ఆపిన వెంటనే ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడిచేసి రెండు చేతులు విరిగేలా కొట్టారని, ఇంతలో హరిదాసుపురం వైపు నుంచి మరో బైక్‌ రావడంతో నిందితులంతా కారులో పారిపోయారని దీనబంధు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారని తెలిపారు. దాడికి పాల్పడిన వారంతా ఒడిశాకు చెందిన వారని, గతంలో గ్రామంలో జరిగిన తగాదాల వల్ల హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. దీనభందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై కె.శిరీష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు