మామ, చెల్లెలు, భార్య కుమ్మక్కై..

1 Jul, 2019 07:04 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ వేణుగోపాల్‌

చెల్లెలు, భార్య, మామల సహకారంతోనే హత్య 

వివరాలు వెల్లడించిన సీఐ వేణుగోపాల్‌

సాక్షి, నాగార్జునసాగర్‌ : ఈ నెల 25న సాగర్‌ కాల్వలో వెలుగుచూసిన వ్యక్తి  హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. చెల్లెలు, భార్య, మామ సహకారంతోనే ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వేణుగోపాల్‌ కేసు వివరాలు వెల్లడించారు. త్రిపురారం మండలం గంటారావు క్యాంపుకు చెందిన పానుగోతు చిట్టికి గత 18 సంవత్సరాల క్రితం కాపువారిగూడేనికి చెందిన పానుగోతు బిచ్ఛ్యా పెద్దభార్య కుమారుడైన పానుగోతు శ్రీను(49)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. సంసార జీవితంలో శ్రీనుకు తనభార్య చిట్టిపై అనుమానం ఏర్పడింది. దీంతో ఆమెను నిత్యం హింసిస్తూండేవాడు. దీంతో చిట్టి భరించలేక ఆరునెలల క్రితమే పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి పోయింది.

చిట్టి అన్నకు ఆమె ఆడపడచు అయిన విజయమ్మను ఇచ్చి వివాహం చేశారు. అతను చనిపోయాడు.విజయమ్మ పండ్ల వ్యాపారి అయిన తన ప్రియుడు రసూల్‌తో కలిసి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉంటోంది. శ్రీను తన భార్య చిట్టికి చెడు అలవాట్లను నేర్పించేది తన చెల్లెలు విజయమ్మనే అని ప్రియుడితో కలిసి ఉండే ఆమె ఇంటికి వెళ్లి తరచు గొడవ పడుతుండేవాడు. వేధిస్తున్నాడని.. భార్య చిట్టి, చెల్లెలు విజయమ్మను ఇబ్బంది పెడుతుండటంతో ఏ విధంగానైనా అతనిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. చిట్టి,విజయమ్మ,చిట్టి తండ్రి పంతుల్యాలు శ్రీనును హత్య చేసేందుకు విజయమ్మ ప్రియుడు రసూల్‌తో రూ.3లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

రసూల్‌ పండ్ల వ్యాపారంలో కూలీలుగా పనిచేసే ఇమ్రాన్, రాహూల్‌తో కలిసి శ్రీనును హత్య చేసేందుకు ఒప్పుకుని రూ.40వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. జూన్‌ 24వతేదీన శ్రీను తన భార్య ఆచూకీ కోసం విజయమ్మ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంట్లోనే ఉన్న విజయమ్మ, ఆమే ప్రియుడు రసూల్, ఆమె కుమారుడు సంతోష్, ఆమె అల్లుడు ఆంగోతు శ్రీను, పండ్ల వ్యాపారంలో కూలీలుగా పనిచేసే ఇమ్రాన్,రాహూల్‌లు శ్రీనును మభ్యపెట్టి మద్యం తాపించారు. అనంతరం నిద్రలో ఉన్న శ్రీనును భార్య చిట్టి,చెల్లెలు విజయమ్మ,మామ పంతుల్యాల అనుమతితో అదే రోజు సాయంత్రం 4గంటలకు చున్నీతో గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు.

అనంతరం అదే రోజు రాత్రి హైదరాబాద్‌ నుంచి డ్రైవర్‌ పాపయ్య కారులో శ్రీను మృతదేహాన్ని తీసుకోని అల్వాల గ్రామ శివారులోని నాగార్జునసాగర్‌ ఎడమకాల్వలో పడవేశారు. పోలీసుల విచారణలో భాగంగా నేరస్తులు 29వ తేదీన త్రిపురారం మండలం కాపువారిగూడెంలో మృతుడి పెద్దఖర్మకు హాజరయ్యారనే సమాచారంతో అదే రోజు సీఐ తన సిబ్బందితో సహా వెళ్లి 9మందిని అదుపులోకి తీసుకుని విచారించడంలో నేరం అంగీకరించారు. ఈ కేసును ఛేదించేందుకు సహకరించిన హాలియా సీఐ ధనుంజయ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ,తిరుమలగిరి ఎస్‌ఐ సత్యనారాయణ,విజయపురిటౌన్‌ ఎస్‌ఐ సీనయ్య,హాలియా ఎస్‌ఐ రాఘవులు సిబ్బందిని అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐలతో పాటు పోలీసులు, సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు